ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఎప్పుడు యుద్ధమొచ్చినా.. నింగి, నేల, నీరు ఎక్కడైనా నౌకాదళం సిద్ధంగా ఉండేలా తయారైందని తూర్పు నౌకాదళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. విశాఖ సముద్రంలో తూర్పు నౌకాదళం (ఈస్టర్న్ ఫ్లీట్) శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి బలాబలాలను ఆయన సోమవారం సమీక్షించారు. ఆపరేషనల్ రెడీనెస్‌కు ఈస్టర్న్ కమాండ్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నౌకాదళ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా సముద్ర ఉపరితలం, లోపల, గాలిలో యాంటీ ఎయిర్ ఆపరేషన్‌లను నౌకాదళంలో ఎలా నిర్వహిస్తారో ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్ నేతృత్వంలో నావికులు చేసి చూపించారు. నీరు, ఆకాశంపై ఆయుధాలను ఫైరింగ్ చేయడం, యాంటీ సబ్‌మెరైన్ విన్యాసాలు చేపట్టడం వంటివి అబ్బురపరిచాయి. యాంఫిబియస్ ఆపరేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిలో పాల్గొన్న నౌకా సిబ్బందిని నేవీ చీఫ్ పెంధార్కర్ అభినందించారు. తీర భద్రత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.










