- పుజారా అర్ధసెంచరీ
- లియాన్‌కు ఎనిమిది వికెట్లు
- ఆసీస్ లక్ష్యం 76పరుగులు
ఇండోర్: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్స్ రెండో ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేశారు. టెస్ట్ బ్యాటర్ ఛటేశ్వర పుజారా(59) అర్ధసెంచరీ మినహా.. టీమిండియా ను ఆదుకొనే మరో బ్యాటర్ కరువయ్యాడు. పర్యాటక జట్టు సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ (8/64) దెబ్బకు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు 197పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ జట్టుకు 88పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. దీంతో ఆసీస్ జట్టు 76 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించాల్సి వచ్చింది.
ఓవర్ నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 156 పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసా గించిన ఆసీస్ జట్టును ఆట ప్రారంభం నుంచే టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. కామెరూన్ గ్రీన్(19), హాండ్స్‌కాంబ్(19) ఔటయ్యాక ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ క్యూ కట్టారు. క్యారీ(3), స్టార్క్(1), లియాన్(5), మర్ఫీ(0)ను స్వల్ప స్కోర్‌కే పెవీలియన్‌కు పంపడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 197పరుగుల వద్ద ముగిసింది. జడేజాకు నాలుగు, అశ్విన్, ఉమేశ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్(5), రోహిత్(12) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవీలియన్‌కు చేరారు. పుజారా అర్ధసెంచరీ మాత్రమే ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. చివరకు లెగ్ స్లిప్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు.
లియాన్‌కు ఎనిమిది వికెట్లు...
స్పిన్నర్లకు అనుకూలిస్తున్న ఇండోర్ పిచ్‌పై నాథన్ లియాన్ చెలరేగాడు. ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16)ను ఎల్బీగా ఔట్ చేసి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. భారత్‌పై అతను ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదోసారి. మొత్తమ్మీద 23.3 ఓవర్లు వేసిన లియాన్ 64పరుగులు మాత్రమే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అలాగే నాథన్ లియాన్ ఎక్కువసార్లు ఔట్ చేసిన భారత బ్యాటర్లలో పుజారా ముందు వరుసగా ఉన్నాడు. లియాన్ 13సార్లు పుజారాను ఔట్ చేశాడు.
స్కోర్‌బోర్డు...
- భారత్ తొలి ఇన్నింగ్స్: 109పరుగుల
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 196పరుగులు
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్‌బి)లియాన్ 12, శుభ్‌మన్ (బి) లియాన్ 5, పుజారా (సి)స్మిత్ (బి) లియాన్ 59, కోహ్లి (ఎల్‌బి)కుహ్నెమన్ 13, జడేజా (ఎల్‌బి)లియాన్ 7, శ్రేయస్ (సి)ఖవాజా (బి)స్టార్క్ 26, శ్రీకర్ భరత్ (బి)లియాన్ 3, అశ్విన్ (ఎల్‌బి)లియాన్ 16, అక్షర్ పటేల్ (నాటౌట్) 15, ఉమేశ్ (సి)గ్రీన్ (బి)లియాన్ 0, సిరాజ్ (బి)లియాన్ 0, అదనం 7. (60.3ఓవర్లలో ఆలౌట్) 163పరుగులు. వికెట్ల పతనం: 1/15, 2/32, 3/54, 4/78, 5/113, 6/118, 7/140, 8/155, 9/155, 10/163 బౌలింగ్: స్టార్క్ 7-1-14-1, కుహ్నెమన్ 16-2-60-1, లియాన్ 23.3-1-64-8, మర్ఫీ 14-6-18-0










