ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ :అప్పుల భారం పెరిగి, వడ్డీలు చెల్లించలేక ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుఉ చెందిన పురుషోత్తం ఆచారి (45) నగరంలోని వైఎస్‌ఆర్ కాలనీలో నివాసముండేవారు. ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం రూ.3ల వడ్డీకి రూ.70 వేలను వేలాయుధం, వసుధల వద్ద అప్పుగా తీసుకున్నారు. నాలుగేళ్లుగా వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి అసలు రూ.2 లక్షలకుపైగా అయ్యింది. అవసరాల నిమిత్తం ఇతరుల వద్ద కూడా మరో రూ.2 లక్షలకుపైగా అప్పులు చేసినట్లు సమచారం. వేలాయుధం కోర్టులో కేసు వేయడంతో అప్పు వడ్డీల కింద వారు వైఎస్‌ఆర్ కాలనీలోని (ప్రస్తుత విలువ) రూ.3 లక్షలు విలువ చేసే ఇంటిని జమ చేసుకున్నారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆయన భార్య తన ఇద్దరు పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడం, ఉన్న ఇళ్లు పోవడం, భార్య వదిలి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గుర్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధిక వడ్డీలు చెల్లించాలని వేధింపుల వలనే పురుషోత్తం ఆత్మహత్య చేసుకున్నారని పిల్లలు ఇద్దరూ, కుటుంబ సభ్యులు ఆరోపించారు.










