ఏ చిత్ర పరిశ్రమలో అయినా నటులుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్లో నటించాలని అనుకుంటారు. ఈ ట్రెండ్ ఇప్పటి తారల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూస్తుంటాం. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత బాలీవుడ్లో నటించనున్నారు నటి అమలాపాల్. అదీ ఓ స్పెషల్ రోల్లో. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'భోలా'లో ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఇటీవల 'ది టీచర్' చిత్రంతో ప్రేక్షకులను పలుకరించిన ఆమె ఇండిస్టీలోకి అడుగుపెట్టి,12 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు..
పేరు: అమలా పాల్ వర్గీస్
ఇతర పేర్లు: అనాఖా
పుట్టిన తేదీ: అక్టోబర్ 26, 1991
పుట్టిన ప్రాంతం: ఎర్నాకుళం, కేరళ
నివాస ప్రాంతం: కొచ్చి, కేరళ
చదువు: బిఎ
హాబీస్: డ్యాన్సింగ్, రీడింగ్, కుక్కింగ్
తల్లిదండ్రులు: పాల్ వర్గీస్, అన్నీస్ పాల్
తోబుట్టువులు: అభిజిత్ పాల్
అమలాపాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రకథా నాయికలలో అమలాపాల్ ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అనేక సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి, మెప్పించారు. దాదాపు దశాబ్దకాలంగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని, ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కాగా తమిళ చిత్రం 'మైనా'తో తెరంగేట్రం చేశారు అమలాపాల్. ఇక బెజవాడ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. అంతేకాదు ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రలను ఎన్నుకుంటూ దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ పరిశ్రమల్లో పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగు పరిశ్రమలో నటించిన చిత్రాలు తక్కువే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, మంచిపేరు తెచ్చుకున్నారు. తెలుగులో యువ నటులైన అల్లు అర్జున్, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించారు. 'నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు' సినిమాల్లో నటించి మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో అమలాపాల్ నటించలేదు. అయితే ఇండిస్టీకి పరిచయమై, పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు..
ఆ టైమ్‌లో ఒత్తిడికి గురయ్యా..
'కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డాను. నా కన్నా చాలా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నేను నటించాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ వాళ్ల నుంచి నటనలో చాలా మెళకువలు నేర్చుకున్నా. జీవితంలో ఒకానొక సమయంలో నేనూ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అప్పుడే ఆలోచనలోపడ్డా.. సక్సెస్ కోసం ఇదంతా చేస్తున్నానా.. అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. సక్సెస్ కోసమే ఇంతగా పాకులాడుతున్నట్టు అనిపించింది. వాస్తవానికి దూరంగా బతుకుతున్నానేమో అని ఫీలయ్యాను. ఆ సమయంలో ఎంతో మదనపడ్డాను. ఒకానొక సందర్భంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా.. కానీ మళ్లీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నా..' అని చెప్పుకొచ్చారు.
ఎన్నో భయాలు వెంటాడాయి..
'తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆడిషన్స్, మీటింగ్స్ అంటూ సంవత్సరంపాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత రెండు సినిమాలు చేశాను. కానీ అవి విడుదల కాలేదు. మూడో సినిమా 'మైనా..' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాను. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు' అంటూ చెప్పుకొచ్చారు అమలాపాల్.
'అయితే ఆ తర్వాతి పరిణామాలతో కొంత ఒత్తిడికి గురయ్యాను. ఒకానొక సమయంలో ఈ సినిమాపిచ్చి వదిలేయాలి. ఇంకా సినిమాలు మానేద్దాం అనుకున్నా. అదే టైంలో మా నాన్న చనిపోయారు. ఆయన చనిపోయిన సమయంలో ఎన్నో భయాలు నన్ను వెంటాడాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఎలాగైనా పోరాడి నిలబడగలిగాను' అని చెప్పుకొచ్చారు. అయితే కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్న అమలాపాల్ చాలా రోజుల తర్వాత ఓటీటీ ఫిల్మ్ పిట్టకథల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.
కెరీర్లో ఒక్కసారైనా..
'మణిరత్నం సార్‌కు నేను పెద్ద అభిమానిని, ఆయన నన్ను పిలవగానే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది కెరీర్లో ఒక్కసారైనా ఆయన చిత్రంలో నటించాలని ఆశిస్తారు. మొదటిసారి ఆడిషన్ చేసిన తర్వాత ఆయన అనుకున్న పాత్రకు నప్పలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్టు కోసం మళ్లీ నన్ను పలిచారు. అయితే, నేను ఆ పాత్ర చేసే మానసిక స్థితిలో లేనని చెప్పా. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా.. అయితే ఎవరైనా 'మీరు ఆ పాత్ర చేయనందుకు విచారం వ్యక్తం చేస్తున్నారా?' అని ప్రశ్నిస్తే, కచ్చితంగా కాదని చెబుతా. ఎందుకంటే కొన్ని విషయాలు అంతే' అని చెప్పుకొచ్చారు.