దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన టెస్ట్ బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్(864పాయింట్లు) అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(859పాయింట్లు)ను వెనక్కి నెట్టి అశ్విన్ టాప్ ర్యాంక్‌కు చేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండోటెస్ట్‌లో అశ్విన్ ఆరు వికెట్లతో రాణించడంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అనూహ్యంగా ఓటమిపాలవ్వడంతో ఆండర్సన్ టాప్ ర్యాంక్ చేజారి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. మూడోస్థానంలో పాట్ కమ్మిన్స్ ఉండగా.. జడేజా 8వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక టెస్ట్ బ్యాటర్స్ జాబితాలో జో రూట్(ఇంగ్లండ్) అగ్రస్థానానికి ఎగబాకగా.. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా), అజమ్ అజామ్(పాకిస్తాన్) టాప్-3లో నిలిచారు. ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఏకంగా 15వ ర్యాంక్‌కు చేరగా.. విరాట్ కోహ్లి 16వ స్థానంలో నిలిచాడు.










