Apr 23,2023 10:24

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ అద్భుతంగా వేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తాను వేసిన 13వ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫలితంగా ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో ముంబై బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేనియల్‌ శామ్స్‌ ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు 31 పరుగులతో అర్జున్‌ టెండూల్కర్‌ అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో ముగ్గురు బౌలర్లు ఉన్నారు. 2014లో బెంగళూరుపై పవన్‌ సుయాల్‌, 2019లో రాజస్థాన్‌ రాయల్స్‌పై అల్జారీ జోసెఫ్‌, 2017లో పంజాబ్‌ కింగ్స్‌పై మిచెల్‌ మెక్‌ క్లెనాన్‌ 28 పరుగుల చొప్పున ఇచ్చుకున్నారు.