Sep 25,2023 22:22
  • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఛైర్మన్‌
  • వేతనాల పెంపుపై కేంద్రానికి లేఖ : మంత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అంగన్‌వాడీల వేతనాల పెంపు, గ్రాట్యూటీ, పదవీ విరమణ ప్రయోజనాల గురించి ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జి సోమవారం శాసన మండలి చైర్మన్‌ మోషన్‌ రాజుకు వాయిదా తీర్మానం అందజేసి చర్చకు పట్టుపట్టారు. ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించడంతో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.5లక్షల మంది వర్కర్లు, హెల్పర్లు ఉన్నారని తెలిపారు. వీరికి కనీస వేతనాలు లేవని, వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనాల కోసం సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. వీరి డిమాండ్లను పట్టించుకోకుండా తీవ్రమైన నిర్బంధం అమలు చేయడం తగదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేయడం దారుణమని అన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని, నిర్బంధాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చకు ఛైర్మన్‌ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ చైర్మన్‌ పోడియంను ముట్టడించారు. మంగళవారం మరో పద్ధతిలో చర్చకు అనుమతిస్తామని ఛైర్మన్‌ హామీ ఇచ్చారు.

వేతనాల పెంపుపై కేంద్రాన్ని సంప్రదించాం : మంత్రి ఉషశ్రీ చరణ్‌

అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాట్యూటీ చెల్లింపు కోసం సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జి ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ సమాధానం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులందరికీ గ్రాట్యూటీ ప్రయోజనాన్ని వర్తింపజేయాలన్న అభ్యర్థనపై కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసుకు చేరిన వర్కర్లకు రూ.50 వేలు, సహాయకులకు రూ.20 వేలు సేవా ముగింపు ప్రయోజనం అందిస్తున్నట్టు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసేందుకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.26 వేలు వేతనం, పదవీవిరమణ ప్రయోజనాల అమలుకు చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని చెప్పి కాలయాపన చేయడం తగదన్నారు. మిగతా రాష్ట్రాలు ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయాలు అమలుచేస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనం పెంచుతామని సిఎం జగన్‌ పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్సీ సాబ్జి మాట్లాడుతూ కనీన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ వర్కర్లకు రూ.11,500, సహాయకులకు రూ.7,500 ఇస్తున్నారని తెలిపారు. అంతేగాక యాప్‌లతో అంగన్‌వాడీ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గతంలో కన్నా ఇప్పుడు వారి పనిభారం పెరిగిందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ యాప్‌ల భారం తగ్గించాలన్నారు. మంత్రి ఉషశ్రీ సమాధానం చెబుతూ యాప్‌ల ఇబ్బంది నుంచి తగ్గించేందుకు ఒక ఎంబి డేటా అదనంగా ఇస్తున్నట్టు తెలిపారు. 2014-2019 కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని చెప్పారు.