ఆండ్రియా జెరెమియా దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 'యుగానికి ఒక్కడు' సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ నటి.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి, మెప్పించారు. అంతేకాకుండా పలు సినిమాల్లో సహాయనటిగానూ నటించారు. అయితే తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె 'అనల్ మెలె పనితుళి' అనే తమిళ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆండ్రియా జెరెమియా. ఆండ్రియా సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, హీరోయిన్‌గా మారారు. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌లో అయినా అవలీలగా నటిస్తూ నటనలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ఆండ్రియా జెరెమియా. 'పచ్చికిలి ముత్తుచారం' చిత్రంతో తమిళంలో సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత 'విశ్వరూపం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగులో 'తడాఖా' అనే చిత్రంలో నటించారు. కోలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ తార గీత రచయితగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం 'అనల్ మేలే పలితులి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆండ్రియా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పారు.
ఆండ్రియా మాట్లాడుతూ.. 'ఇది నా చిన్నప్పుడు జరిగింది. అప్పుడు నా వయసు దాదాపు 11 ఏళ్లు ఉంటుంది. నాన్నతో కలిసి బస్సులో వెళ్తున్నా. ఆయన నా పక్కనే కూర్చున్నారు. సడన్‌గా ఒక చేయి నా వీపుపై ఆనింది. నాన్నేమో అనుకున్నా. కానీ అంతలోనే ఆ చేయి నా టీషర్ట్ లోపలికి వెళ్లడంతో నాన్నవైపు చూశాను. ఆయన రెండు చేతులు ముందే ఉన్నాయి. ఇంతలో ఆ చేయి ఇంకా లోనికి వెళ్లడంతో వెంటనే నేను కాస్త ముందుకు జరిగి కూర్చున్నా. కానీ ఈ విషయాన్ని నాన్నకో, అమ్మకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదంటే నా దగ్గర కారణం లేదు. బహుశా పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకుని, చెప్పలేకపోయానేమో! కానీ అప్పుడే ఇది బయటకు చెప్పుంటే నాన్న ఏదో ఒక పనిచేసి, అతడికి బుద్ధొచ్చేలా చేసేవాడు. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు ఆండ్రియా.
అందుకే పియానోపై ఆశ తగ్గింది..
చిన్నతనం నుంచి తనకు సంగీతం అంటే చాలా ఇష్టమని, దీంతో పియానో నేర్చుకున్నానని గుర్తు చేశారు. అయితే మొదట్లో అద్దె ఇల్లు, మోటార్ బైక్ ఇలా మధ్యతరగతి కుటుంబంతో తమ జీవితం ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆ తర్వాత సొంత అపార్ట్‌మెంట్, కారు అంటూ నెమ్మదిగా ఎదిగామని చెప్పారు. మొదట్లో నాన్న తనకు అడిగినవన్నీ కొనిచ్చారని, అయితే పియానో కొనడం ఆడంబరంగా అనిపించిందన్నారు.
తనకు 18 ఏళ్లు వచ్చిన తర్వాతే నాన్న పియానో కొనిచ్చారని, అయితే అప్పటికే నటనపై దృష్టి సారించటంతో పియానో ఆశ కొంత వరకూ తగ్గిందన్నారు. కానీ ఇప్పటికీ తన పియానో భద్రంగా తన షోకేస్‌లో ఉందని పేర్కొన్నారు. కాగా తాను రూపొందించిన సంగీత ఆల్బమ్‌ను విడుదల చేయడానికి కారణం సంగీతానికి సంబంధించినది మాత్రమే కాకుండా పేద పిల్లల చదువు కోసం అని తెలిపారు. తాము 'సోఫియా ట్రస్'్ట పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అనాథ పిల్లల విద్యకు సాయం చేస్తున్నామని చెప్పారు. పేదరికం, ఆకలి లేని భారతదేశం అవతరించాలంటే విద్య ఒక్కటే మార్గమని తాను గట్టిగా విశ్వసిస్తానని ఆండ్రియా చెప్పుకొచ్చారు.
ఆ రోజు కోసం వేచి చూస్తున్నా..
ఇటీవల ఆమె 'ఫ్లేవర్స్' అనే మ్యూజిక్ ఆల్బమ్ తయారుచేశారు. తను రాసిన ఏడు పాటలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయని తెలిపారు. ప్రేమలో పడటం, ప్రేమ విఫలమై గాయపడటాన్ని ఈ పాటల నేపథ్యంగా తీసుకున్నారు ఆండ్రియా. సోషల్ మీడియాలో తనకు కనిపించే ప్రేమికుల స్పందనే ఈ పాటలు రాసేందుకు స్ఫూర్తిగా నిలిచిందని ఆమె చెప్పారు.
'పాటలు రాయడం నాకొక అలవాటు. లాక్‌డౌన్ టైమ్‌లో ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ఆస్వాదించారు. అప్పటి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ పాటల్లోని ఏడింటిని ఆల్బమ్‌గా తయారుచేశాం. ప్రేమలో జయాపజయాలను ఇతివృత్తంగా ఎంచుకుని, పాట రాశాను. సినిమా సంగీతంలా ప్రైవేట్ మ్యూజిక్‌కూ పేరొచ్చే రోజు కోసం వేచి చూస్తున్నా' అని చెప్పారు. ప్రస్తుతం 'కా', 'పిసాసు 2', 'మాలిగై' వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆండ్రియాకు పలు మ్యూజిక్ లేబుల్స్ నుంచి ఆల్బమ్స్ చేయమంటూ అవకాశాలు వస్తున్నాయి.
పేరు: ఆండ్రియా జెరెమియా
ఇతర పేర్లు : ఆండీ, రోసీ
పుట్టిన తేదీ: డిసెంబర్ 21, 1985
పుట్టిన ప్రాంతం: తమిళనాడు
నివాస ప్రాంతం : చెన్నరు
చదువు: గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు: మేరీ జెరెమియా, మార్టిన్
తోబుట్టువులు: నదియా జెరెమియా
హాబీస్: సింగింగ్, ట్రావెలింగ్