Jan 26,2023 20:59
  • అస్సాంపై ఇన్నింగ్స్‌ 95పరుగుల తేడాతో గెలుపు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరంలోని చింతలవలస పివిజి రాజు క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 113పరుగులకే పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్‌ అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్‌ స్కోర్‌ ఐదు వికెట్ల నష్టానికి 62 పరుగులతో గురువారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అస్సాం జట్టును లలిత్‌(5/40), షోయబ్‌(2/30) దెబ్బతీసారు. దీంతో అస్సాం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 153పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్‌ 95పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • జడేజాకు ఏడు వికెట్లు

తమిళనాడుతో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో సత్తా చాటాడు. సౌరాష్ట్ర కెప్టెన్‌ జడేజా(7/53) దెబ్బకు తమిళనాడు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 324పరుగులు చేయగా.. సౌరాష్ట్ర 192పరుగులకే కుప్పకూలింది. దీంతో 266పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌరాష్ట్ర జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది.

  • ఓటమిదిశగా హైదరాబాద్‌..

ఢిల్లీతో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఓటమి కోరల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 355పరుగులు చేస్తే.. ఢిల్లీ జట్టు 433పరుగులు చేసింది. దీంతో 78పరుగులు వెనుకబడ్డ హైదరాబాద్‌ జట్టు గురువారం రెండో ఇన్నింగ్స్‌లో 90పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సంతోష్‌(20), షషాంక్‌(12) క్రీజ్‌లో ఉన్నారు.