- భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై హెచ్‌ఏఐ అధ్యక్షుడు జగన్
- అంతర్జాతీయ, ఆసియా సమాఖ్యల గుర్తింపు
- త్వరలోనే ఐఓఏ నుంచీ సానుకూల స్పందన
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్‌బాల్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న సందిగ్థత, రాజకీయాలు, కుట్రలకు శాశ్వతంగా ముగింపు పలికామని భారత హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్యలు హెచ్‌ఏఐకు భారత్‌లో జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు అందించాయని, ఇక్కడ హ్యాండ్‌బాల్ నిర్వహణ, అభివృద్దిపై సర్వ హక్కులూ హెచ్‌ఏఐ సొంతమని జగన్‌మోహన్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్యలు భారత ఒలింపిక్ సంఘానికి పంపిన లేఖల ప్రతులను చూపించారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) కాకుండా.. మరే ఇతర సంఘం హ్యాండ్‌బాల్‌లో జోక్యం చేసుకున్నా తక్షణమే భారత్‌లో హ్యాండ్‌బాల్‌పై నిషేధం విధిస్తామని అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య ఇటీవల ఐఓఏకు రాసిన లేఖను సైతం జగన్‌మోహన్ రావు విలేకరుల సమావేశంలో బయటపెట్టారు. 'ఎటువంటి సిఫారసులకు తలొగ్గకుండా ఉత్తమ జట్లను ఎంపిక చేశాం. హిమాచల్ ప్రదేశ్‌లో ఆధునాతన అకాడమీలో శిక్షణ అందించాం. ఫలితంగా, 2022 ఆసియా జూనియర్ మహిళల యూత్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు అదే ఏడాది ఆసియా మహిళల యూత్ బీచ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాం. 2023 ఆసియా మహిళల ప్రెసిడెంట్ కప్ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించాం. 2023 ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది. దక్షిణాది, ఓ తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ సమాఖ్య అధ్యక్ష పగ్గాలు చేపట్టడం కొందరికి నచ్చలేదు. అధ్యక్ష పీఠం నుంచి తొలగించేందుకు కుట్ర చేశారు. ఇంత చేసినా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. దేశంలో హ్యాండ్‌బాల్ కార్యకలాపాలను హెచ్‌ఏఐ మాత్రమే నిర్వహించేలా భారత ఒలింపిక్ సంఘానికి అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య లేఖ రాసింది. అడ్డంకులు సృష్టిస్తున్న సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి హ్యాండ్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని' జగన్ వెల్లడించారు.
రెండు మెగా టోర్నీలు : 'ఈ ఏడాది రెండు మెగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్ పోటీలను జూన్‌లో నిర్వహించనున్నాం. జూన్ 8 నుంచి 25 వరకు ఈ పోటీలు జరుగుతాయి. జులైలో ఆసియా మహిళల యూత్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. న్యూఢిల్లీ వేదికగా జులై 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ ఉంటుంది. జపాన్, చైనా, చైనీస్ తైపీ, ఇరాన్ సహా పది దేశాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. గత ఏడాది హైదరాబాద్ వేదికగా ఆసియా మెన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించటంతో ఆసియా యూత్ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కాయని' అని జగన్ అన్నారు.










