May 03,2023 13:33

చెన్నై : ప్రముఖ తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌కు గాయమైంది. ఆయన నటిస్తోన్న తంగళన్‌ రిహార్సల్‌ సెషన్‌ లో విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. పరీక్షించిన డాక్టర్లు విక్రమ్‌ పక్కటెముక విరిగినట్లు గుర్తించి ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. విక్రమ్‌ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని అన్నారు.

                                           వీలైనంత త్వరగా మళ్లీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటా : విక్రమ్‌

దీనిపై హీరో విక్రమ్‌ స్పందించారు. గాయంతో కొన్ని రోజులు చిత్రీకరణకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. వీలైనంత త్వరగా మళ్లీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటానని అన్నారు.

డైరెక్టర్‌ పారంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంగళన్‌. ఇందులో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ అంచనాలు తారాస్థాయికి చేర్చాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా కొద్ది రోజులుగా తంగళన్‌ సినిమా చిత్రీకరణకు విక్రమ్‌ దూరంగా ఉన్నారు. చెన్నైలో జరుగుతున్న ఈ మూవీ రిహార్సల్‌ సెషన్‌ లో గత రెండు మూడు రోజులుగా ఆయన పాల్గంటున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.