Feb 07,2023 18:42

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా టి20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఫించ్‌.. ప్రస్తుతం కేవలం టి20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. '2024 జరగబోయే టీ20 ప్రపంచకప్‌ వరకు నేను ఆడలేకపోవచ్చని అర్థమైంది. ఫిట్‌నెస్‌ సాధించలేకపోతున్నా. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. వచ్చే ఏడాది మెగా టోర్నీ నాటికి జట్టును సమాయత్తం చేసేందుకు తగినంత సమయం ఉంటుంది. నాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తొలిసారి టి20 ప్రపంచకప్‌(2021), సొంతగడ్డపై 2015లో వన్డే ప్రపంచకప్‌ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేను' అని ఫించ్‌ వెల్లడించారు. ఫించ్‌ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచులు ఆడాడు. అందులో ఐదు టెస్టు సిసీస్‌లు కాగా, 146 వన్డేలు మ్యాచులు, 103 టీ20లు ఆడాడు. మొత్తంగా 8,804 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక స్కోరు ఫించ్‌(172) పేరుమీదే ఉంది. 2014, 2018లో టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఎంపికయ్యాడు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ను కూడా ముద్దాడాడు. ఇక, ఫించ్‌ సారథ్యంలో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021 టోర్నీలో విజయం సాధించి ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.