అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 'ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023' పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గంలో నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వెల్లడించనున్నారు.










