Sep 10,2022 10:27

దుబాయ్ : ఆసియాకప్‌ టోర్నీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఇప్పటికే ఇరుజట్లు ఫైనల్లోకి చేరడంతో శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో లంక జట్టు 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టు 19.1 ఓవర్లలో 121పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ బాబర్‌(30), నవాజ్‌(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. హసరంగ(3/21)కి తోడు తీక్షణ, మధుశన్‌కు రెండేసి, ధనుంజయ, కరుణరత్నేకు తలా ఒక వికెట్‌ లభించాయి. ఛేదనలో లంక జట్టు ఓపెనర్‌ నిస్సంక(55నాటౌట్‌) అర్ధసెంచరీకి తోడు రాజపక్సే(24), శనక(21) ఫర్వాలేదనిపించారు. దీంతో లంక జట్టు 17 ఓవర్లలో కేవలం 5వికెట్లు కోల్పోయి 124పరుగులు చేసి గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హసరంగకు లభించగా.. నేటితో సూపర్‌-4మ్యాచ్‌లు పూర్తయ్యాయి.