Oct 02,2023 20:50
  • సిపిఎం రాష్ట్ర సదస్సులో వి శ్రీనివాసరావు డిమాండ్‌

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను బిజెపి ప్రభుత్వం తప్పిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికైనా విభజన చట్టంలో పేర్కొన్న ఏడు జిల్లాలతోపాటు వెనుకబడిన ప్రకాశం జిల్లాకూ ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనే అంశంపై అనంతపురంలోని లలిత కళా పరిషత్‌ హాలులో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సదస్సు ప్రారంభానికి ముందు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్టమెంట్‌లోనూ నాటి ప్రధాని కొన్ని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, పదేళ్లు కాబోతున్నా ఏ ఒక్క హామీనీ బిజెపి సర్కార్‌ అమలు చేయలేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఏడాదికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలు కేటాయించి తరువాత వెనక్కు తీసుకున్నారని విమర్శించారు. నిత్యం రాముడు పేరు జపించే బిజెపి... రాముడిలాగా మాట నిలుపుకోలేదన్నారు. ఆయన తండ్రికిచ్చిన మాట కోసం అరణ్యం వెళ్లారని గుర్తు చేశారు. ఈ పేరు చెప్పుకునే బిజెపి మాత్రం వంద అబద్ధాలైనా ఆడుతుందే తప్ప, ఇచ్చిన మాట నిలుపుకోదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఉన్నాయన్నారు. రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ అత్యంత దుర్బిక్ష ప్రాంతంగానే ఉందన్నారు. సాగు, తాగునీటి వనరుల్లేక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 1984లో చేపట్టిన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తవలేదన్నారు. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలిపారు. విలువైన ఖనిజ నిక్షేపాల నిలయం రాయలసీమ అని గుర్తు చేశారు. పెద్దపెద్ద కంపెనీలకు ఇక్కడున్న వేల ఎకరాల భూములను ప్రభుత్వాలు కట్టబెట్టేస్తున్నాయన్నారు. అయితే, ఒక్క పరిశ్రమా ఏర్పాటు చేయలేదని తెలిపారు. చిలమత్తూరు మండలంలో 8,484 ఎకరాల భూమిని లేపాక్షి నాలెడ్జి హబ్‌ పేరుతో తీసుకుని పరిశ్రమ పెట్టకుండానే, రూ.700 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టారన్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయకుండానే నష్టం వచ్చిందనడం ప్రపంచంలోనే ఒక వింత అని వ్యాఖ్యానించారు. ఇక ఆదానీ సంస్థకు ఇదే రకంగా భూములు కేటాయిస్తున్నారన్నారు. సోలార్‌ ద్వారా విద్యుదుత్పత్తికి కారుచౌకగా భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. నెలకు వారికేమో ఎకరంలో ఐదారు లక్షల రూపాయలు ఆదాయమొస్తుంటే, రైతులకేమో ఏడాదికి రూ.30 వేలు లీజు ఇస్తామంటున్నారని అన్నారు. ఎకరానికి నెలకు రూ.30 వేలు రైతులకు లీజు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసి జిల్లా నాయకులు కృష్ణ, ఎస్‌యుసిఐసి జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, ప్రజా పరిరక్షణ వేదిక కన్వీనర్‌ సత్యబోసు, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు ప్రసంగించారు. మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా, సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు, సావిత్రి, సిపిఎం సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశారు, నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్‌, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు, అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రకాశం జిల్లా కార్యదర్శి హనీఫ్‌, చిత్తూరు జిల్లా కార్యదర్శి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.