Apr 06,2023 20:23
  • ప్రభుసిమ్రాన్‌ అర్ధసెంచరీ.. రాజస్తాన్‌పై ఐదు పరుగుల తేడాతో గెలుపు
  • సంజు, హెట్‌మెయిర్‌ పోరాటం వృధా

గౌహతి: చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో అంతిమ విజయం పంజాబ్‌ కింగ్స్‌ పక్షాన నిలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో రాజస్తాన్‌ జట్టు చివరి బంతి వరకు పోరాడి 7వికెట్లు కోల్పోయి 192పరుగులే చేయగల్గింది. చివరి ఓవర్లో గెలుపుకు 17పరుగులు అవసరం కాగా.. రాజస్తాన్‌ జట్టు కేవలం 11 పరుగులే చేయగల్గింది. దీంతో పంజాబ్‌ జట్టు 5పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధావన్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలిచి బ్యాటింగ్‌లో చెలరేగగా.. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ అర్ధసెంచరీలతో చెలరేగారు. అస్సాంలోని బర్సపారా స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌ దిగిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (60; 34బంతుల్లో, 7ఫోర్లు, 3సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86నాటౌట్‌; 56బంతుల్లో, 9ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఛేదనలో రాజస్తాన్‌ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు జైస్వాల్‌, అశ్విన్‌ నిరాశపరిచారు. ఆ తర్వాత స్టార్‌ బ్యాటర్‌ బట్లర్‌కు కూడా త్వరగా పెవీలియన్‌కు చేరడంతో రాజస్తాన్‌ జట్టు 57పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ సంజు(42), పటిధర్‌(21)కి తోడు చివర్లో రియాన్‌ పరాగ్‌(20), హెట్‌మేయర్‌(36) విజయంపై ఆశలు రేపారు. చివరి ఓవర్‌ వరకు పోరాడినా.. రాజస్తాన్‌ జట్టు 192పరుగులే చేయగల్గింది. ఎల్లిస్‌కు నాలుగు, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

  • రాజపక్సకు గాయం..

శ్రీలంక విధ్వంసక ఆటగాడు బానుక రాజపక్స్‌ గాయపడి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కొట్టిన స్ట్రెయిట్‌ షాట్‌ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో రాజపక్స విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది. ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్‌ పట్టుకోవడం కష్టం కాగా.. రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. స్కానింగ్‌ రిపోర్ట్‌లో పాజిటివ్‌ వస్తే రాజపక్స ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. హోల్డర్‌కు రెండు, అశ్విన్‌, చాహల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌:

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి)బట్లర్‌ (బి)హోల్డర్‌ 60, ధావన్‌ (నాటౌట్‌) 86, రాజపక్సా(రిటైర్డ్‌హార్ట్‌) 1, జితేశ్‌ శర్మ (సి)రియాన్‌ పరాగ్‌ (బి)చాహల్‌ 27, సికిందర్‌ రాజా (బి)అశ్విన్‌ 1, షారుక్‌ ఖాన్‌ (సి)బట్లర్‌ (బి)హోల్డర్‌ 11, శామ్‌ కర్రన్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 197పరుగులు. వికెట్ల పతనం: 1/90, 2/158, 3/159, 4/195 బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-38-0, ఆసిఫ్‌ 4-0-54-0, అశ్విన్‌ 4-0-25-1, హోల్డర్‌ 4-0-29-2, చాహల్‌ 4-0-50-1
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)షార్ట్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 11, అశ్విన్‌ (సి)ధావన్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 0, బట్లర్‌ (సి అండ్‌ బి) ఎల్లిస్‌ 19, సంజు (సి)షార్ట్‌ (బి)ఎల్లిస్‌ 42, దేవదత్‌ పటీధర్‌ (బి) ఎల్లిస్‌ 21, రియాన్‌ పరాగ్‌ (సి)షారుక్‌ ఖాన్‌ (బి)ఎల్లిస్‌ 20, హెట్‌మెయిర్‌ (రనౌట్‌) షారుక్‌/శామ్‌ కర్రన్‌ 36, జోరెల్‌ (నాటౌట్‌) 32, హోల్డర్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 192పరుగులు. వికెట్ల పతనం: 1/13, 2/26, 3/57, 4/91, 5/121, 6/124, 7/186 బౌలింగ్‌: శామ్‌ కర్రన్‌ 4-0-44-0, ఆర్ష్‌దీప్‌ 4-0-47-2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-15-0, ఎల్లిస్‌ 4-0-30-4, రాహుల్‌ చాహర్‌ 4-0-31-0, సికిందర్‌ రాజా 2-0-24-0