Oct 04,2023 16:21

మహబూబాబాద్‌: ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్వాకానికి వికలాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలూరి యాకన్న (32) అనే వికలాంగుడికి గత నెల 18న జ్వరం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ యాకయ్య వద్దకు వైద్యం కోసం వెళ్లాడు. వికలాంగుడిని పరిశీలించిన డాక్టర్‌ గ్లూకోజ్‌ పెట్టాడు. మధ్యలో పేషెంట్‌కు చలి రావడంతో ఇంజక్షన్‌ ఇచ్చాడు.ఇంటికి వెళ్లిన తర్వాత యాకన్న అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే తొర్రూరులో ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు పరిస్థితి సీరియస్‌గా ఉందని వెంటనే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు.వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హైదరాబాద్‌కు తీసుకుపోవాలని సూచించడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు చికిత్స పొందుతూ యాకన్న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాకన్న బంధువులు, ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే ఆర్‌ఎంపీ డాక్టర్‌ యాకయ్య కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు.