ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు, ఖాళీల వివరాలు చెప్పాలని మంత్రిని శాసనమండలిలో పిడిఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ టిడిపి సభ్యులు పి అశోక్‌బాబు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, బి తిరుమల నాయుడు శుక్రవారం విడివిడిగా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మంజూరు పోస్టులు 1,88,162 ఉన్నాయని మంత్రి సమాధానం చెప్పారు. వీటిల్లో 1,69,642 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. కేవలం 8,366 పోస్టులు మాత్రమే అవసరమని మంత్రి సమాధానం చెప్పారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 2019 నుంచి 14,129 మంది ఉపాధ్యాయులను నియమించామని వివరించారు. రాష్ట్రంలో 20 వేల నుంచి 25 వేల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. వీటి భర్తీ కోసం వెంటనే మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.










