- కేంద్రం మంజూరు చేసింది 14 కోట్లే
- వచ్చే నెలలోనే 14 కోట్ల పనిదినాలు పూర్తి చేసేలా జిల్లాలకు లక్ష్యాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఈ ఏడాది 29.51 కోట్ల పని దినాలను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. వాస్తవానికి కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 14 కోట్ల ఉపాధి పని దినాలనే మంజూరు చేసింది. గతేడాదితో పోల్చితే 12 కోట్ల పని దినాలు తక్కువే. దీనివల్ల ఉపాధి కార్మికులకు పూర్తిస్థాయిలో పని కల్పించడం కష్టంగా మారుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పడ్డాయి. మొత్తం 26 జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చికల్లా 29.51 కోట్ల పని దినాలను పూర్తి చేసేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యాలను నిర్దేశించింది. ఒక్కో జిల్లాలో సగటున కోటి పని దినాలను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామాల్లోని ఉపాధి కార్మికులకు సుమారు 5.16 కోట్ల పని దినాలను కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జిల్లాల వారీగా ఎన్ని పని దినాలను పూర్తి చేయాలో కూడా గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యాలను నిర్దేశించింది. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 14 కోట్ల పని దినాలను వచ్చే నెలలోగా పూర్తి చేయాలని, ఆలోగానే అదనపు పని దినాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలనే యోచనలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఉన్నారు.
వీలైనంత ఎక్కువ మెటీరియల్ గ్రాంట్
ఉపాధి పనుల ద్వారా రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ మెటీరియల్ గ్రాంట్ విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై సమీక్షలు నిర్వహించిన సిఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో మట్టి పనులు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉపాధి మెటీరియల్ నిధులతోనే సచివాలయ భవనాలతోపాటు ఆర్‌బికెలు, హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీ భవనాలను నిర్మించాల్సి ఉంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో భవన నిర్మాణాలు జరుగుతుండగా, పెండింగ్ బిల్లులు వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఈ తరుణంలో గతేడాదికంటే ఎక్కువ పని దినాలను పూర్తిచేయడంతోపాటు మెటీరియల్ గ్రాంట్ కింద వీలైనంత ఎక్కువ నిధులను రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మంజూరైన పని దినాలకంటే రెట్టింపు పని దినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు.
రూ.1,253.72 కోట్ల విలువైన పనులు
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.1,253.72 కోట్ల విలువైన ఉపాధి పనులు జరిగినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తెలిపింది. ఇందులో రూ.933.34 కోట్లను వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉండగా, మెటీరియల్ కాంపోనెంట్ విలువ రూ.296.29 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడత రూ.929 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను మంజూరు చేసింది. కార్మికుల వేతనాల చెల్లింపునకు రూ.765.17 కోట్లు అందుబాటులో ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ.685.17 కోట్లనే విడుదల చేసింది. ఉపాధి వేతనాల కింద రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ.622 కోట్లు విడుదలయ్యాయి. అందులో రూ.302.96 కోట్లను వేతనదారుల ఖాతాల్లో జమవ్వగా, రూ.319 కోట్లను త్వరలోనే జమ చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ ఇటీవల వెల్లడించారు. ఉపాధి కార్మికుల వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.











