Jan 25,2022 16:35

న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 'మా ప్రియతమ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ నెల 27న పంజాబ్‌కు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు' అని సిద్ధూ ట్వీట్‌ చేశారు.
రాహుల్‌గాంధీ గురువారం ప్రత్యేక విమానంలో పంజాబ్‌కు చేరుకుంటారు. అనంతరం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగబోతున్న 117 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలిసి రోడ్డు మార్గాన వెళ్లి అమృత్‌సర్‌లోని శ్రీ హర్‌మందిర్‌ సాహిబ్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీదుర్గాయ మందిర్‌ను, భగవాన్‌ వాల్మీకి తీరథ్‌ స్థల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన జలంధర్‌కు వెళ్లి అక్కడ వర్చవల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోడ్డు జలంధర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 20న జరగనున్న ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడడంతో రాహుల్‌గాంధీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.