- ప్లాట్ల కొనుగోలుపై సిఆర్‌డిఎ ప్రకటన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిలోని జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో ప్లాట్లను రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైనా కొనుక్కోవచ్చని, వారికి 20 శాతం రాయితీ ఇస్తామని సిఆర్‌డిఎ కమిషనరు వివేక్‌యాదవ్ ప్రకటించారు. సిఆర్‌డిఎ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో పదిశాతం ప్లాట్లను 20 శాతం రాయితీకి ఇస్తున్నామని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎంఐజి లేఅవుట్లో 200 గజాల ప్లాట్లు 58, 240 చదరపు గజాల ప్లాట్లు 188 అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్లాట్‌లో చదరపు గజం రూ.17,499గా ప్రకటించారు. అలాగే ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 40 శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ మినహాయింపూ ఉంటుందని వివరించారు. టౌన్‌షిప్ ఏర్పాటుచేసి ఏడాది దాటిపోతున్నా స్పందన లేకపోవడంతో సిఆర్‌డిఎ ఈ నిర్ణయం తీసుకుంది.










