Jun 30,2022 07:50
  • అందని పరిహారం - అడ్డుగా మారుతున్న ని'బంధనాలు'

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ప్రభుత్వ సాయం లేకుండానే పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేసి నష్టపోయిన కౌలు రైతుకు చనిపోయిన తరువాత కూడా గుర్తింపు లేదు. సిసిఆర్‌సి (పంట సాగుదారు హక్కు) కార్డు లేదన్న పేరుతో ఇంటి పెద్దదిక్కు కోల్పోయినా ప్రభుత్వ సాయం అందటం లేదు. పంటల సాగు కోసం చేసిన అప్పుల బాధలు ఒకవైపు వెన్నాడుతుంటే.. మరోవైపు కుటుంబ భారమూ అధికమై ఉన్న వారి జీవనం దుర్భరమవుతోంది. పిల్లల చదువులు కూడా మధ్యలోనే ఆగిపోయే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
     ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 2021, 2022 సంవత్సరంలో మొత్తం 95 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 63 రైతు ఆత్మహత్యలుగా అధికారులు నిర్ధారించారు. 42 మందికి పరిహార మందగా..21 మందికి అందాల్సి ఉంది. 32 మంది పరిహారానికి అనర్హమైనవిగా తేల్చారు. అనర్హమైనవిగా తేల్చిన వాటిల్లో అత్యధికంగా కౌలు రైతులే ఉండటం గమనార్హం. వీరి పేరుమీద పాసుపుస్తకం, సిసిఆర్‌సి కార్డులు లేకపోవడంతో పరిహారానికి అనర్హులుగా తేల్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో అనంతపురంలో ఏప్రిల్‌ 12న పర్యటన ఉండగా...అందుకు ఒక్కరోజు ముందు రాష్ట్ర ప్రభుత్వం 30 మందికి వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయల పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
 

                                     సిసిఆర్‌సి కార్డులు లేకపోవడంతోనే అనర్హులవుతున్నారు

పంటల సాగు హక్కుదారుల చట్టం -2019ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. అయితే ఆచరణలో అది లక్ష్యానికి అనుగుణంగా అమలు కావడం లేదు. కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు వచ్చినంత మాత్రాన భూ యజమాని తన హక్కులను కోల్పోడు. దీనిపై రైతుల్లో అధికార యంత్రాంగం అవగాహన కల్పించాల్సి ఉంది. సిసిఆర్‌సి కార్డులు ఉంటే కౌలు రైతు నష్టపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు వీలుంటుంది. సిసిఆర్‌సి కార్డులు లేని కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు.
                      - భానుజ రైతు స్వరాజ్య వేదిక నాయకులు

 

swapna



                                              నేనూ ఆత్మహత్యాయత్నం చేశాను : స్వప్న

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలోనున్న నారాయణ స్వామి తండ్రి పేరు మీద నాలుగు ఎకరాల పొలముంది. తాను చనిపోయే వరకు కుమారుడికి ఆస్తి ఇవ్వనని చెప్పడంతో నారాయణస్వామి మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పంట సాగు కోసం రూ. ఐదు లక్షలు అప్పు చేశారు. వరుసగా నష్టాలు రావడంతో అప్పుల భారం అధికమైంది. అప్పు తీర్చే మార్గంలేక 2021 సెప్టెంబర్‌ 22న పురుగుల మంది తాగి నారాయణస్వామి ఆత్మహత్య చేసుకున్నారు. రుణదాతల సూటీపోటీ మాటలు భరించలేక మృతుని భార్య స్వప్న కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల పోషణ, అప్పులు తీరే దారి లేదని..తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది.

 

lakshmi



                                              చిన్నారులను ఎలా చదివించాలి : లక్ష్మిదేవి

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన పెద్దపప్పురు గ్రామానికి చెందిన కౌలు రైతు బాలచంద్రయ్యకు కూతురు యమున, కుమారుడు ఉత్తేజ్‌ ఉన్నారు. పదోతరగతి పరీక్షలో కూతురు 577 మార్కులు సాధించారు. ఉమ్మడి ఆస్తి రెండెకరాల సొంతపొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ, పత్తిపంట సాగు చేశారు. అధిక వర్షాలతో పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. పంటల సాగు, కుటుంబపోషణ కోసం సుమారు రూ.11 లక్షలు అప్పులు చేశారు. అప్పులు తీరేదారి లేక 2021 ఆగస్టు ఒకటిన బాలచంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ భారమంతా ఆయన భార్య లక్ష్మిదేవిపై పడింది. పిల్లల చదువులు, జీవనం ఎలా కొనసాగించాలో అర్థం కాక ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిసిఆర్‌సి కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సాయం అందలేదు.