Feb 14,2023 23:15

యువకునితో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌


ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మనస్తాపంతో గోదావరి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని ఎంపీ భరత్‌ కాపాడారు. గోపాలపురంలోని ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ భరత్‌ బయలు దేరారు. ఆయన వాహనం రోడ్డు కం రైలు బ్రిడ్జిపైకి వెళ్లే సరికి ఒక యువకుడు ఆందోళనకరంగా ఉండటాన్ని గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటున్నాడని గ్రహించి వాహనాన్ని వేగంగా యువకుని వద్దకు పోనిచ్చి ఒక్క ఉదుటున దూకి యువకుని కాలర్‌ పట్టుకుని వెనక్కి లాగారు. అనంతరం అతన్ని ఫుట్‌పాత్‌ నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చి ఆరా తీశారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో రాజమహేంద్రవరం టుటౌన్‌ సిఐకు ఫోన్‌ చేశారు. యువకునికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. కొంతమంది సహాయంతో యువకుడిని ఆటోలో రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనది నిడదవోలు మండలం ఉనకరమిల్లి అని తన పేరు అయ్యప్ప అని, తండ్రి పేరు సీతపతిరావు అని పోలీసులకు చెప్పాడు. తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కళాశాలలో ట్రిపుల్‌ ఇ పూర్తి చేశానని తెలిపారు. జడ్‌చర్ల అరబిందో ఫార్మసీలో మూడేళ్లుగా ఉద్యోగ చేసినట్టు తెలిపాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలను తెలుపలేదు. పోలీసులు యువకునికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.