ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్ ప్రారంభమైన విషయం విదితమే. దీంతో రైతులు సాగు పనులలో నిమగమై ఉన్నాయి. జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్లుగా నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి రూ.270 విలువ చేసే యూరియాను రూ.320 నుంచి రూ.350 వరకూ విక్రయిస్తున్నారు. ఒక ఎకరా వరికి కనీసంగా 5 బస్తాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఐదెకరాల రైతుపై అక్షరాలా రూ.500 నుంచి రూ.750 అదనపు భారం పడుతోంది. జిల్లాలో 75 సహకార సంఘాలు ఉన్నాయి. 160 మంది డీలర్లు ఉన్నారు.367 ఆర్‌బికేలున్నాయి. ఆర్‌బికెల్లో ముందుగా నగదు చెల్లించిన అనంతరం డెలివరీ ఇస్తామనడంతో తొలుత పెట్టుబడి పెట్టే ఆర్థిక శక్తి లేక రైతులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా మార్చుకుని డీలర్లు చక్రం తిప్పుతున్నారు. అధికధరలకు విక్రయిస్తున్నారు.
చక్రం తిప్పుతున్న డీలర్లు
జిల్లాలో ఉన్న కొద్ది మంది డీలర్లు ఈ దందాను సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు వచ్చిన యూరియా లోడ్‌లో 50 శాతం ఈ నలుగురు డీలర్లే దక్కించుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 160 మందికి పైగానే డీలర్లు ఉన్నారు. రైతులకు కొరత లేకుండా జిల్లాకు వచ్చిన యూరియాను డీలర్లందరికీ సరఫరా చేయాలి. యూరియాలో కొందరు డీలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువ వసూలు చేస్తూ రిటైల్ దుకాణాలకు తరలిస్తున్నారు. బస్తాకు రూ.20 అదనంగా సబ్ డీలర్లకు అందిస్తున్నారు. సబ్ డీలర్లు మరో రూ.20 లాభం తీసుకుని రైతులకు ఇస్తున్నారు. ప్రభుత్వం బస్తా యూరియా ధరను రూ.268గా నిర్ణయించగా, ఆ నలుగురు డీలర్లు, సబ్ డీలర్ల వ్యవహారంతో బస్తా యూరియా రూ.300 నుంచి రూ.330కి పెరిగింది. ఒక్క బస్తా మీద రూ.60 అదనంగా రైతు చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు మూడు బస్తాల యూరియా అవసరం. ఈ లెక్కన బక్క రైతు మీద రూ.200 అదనపు భారం పడుతోంది. ఈ రబీ సీజనలో 2లక్షల ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేస్తారు. దీంతో కోట్లలో నష్టపోతున్నారు.
జిల్లాలో రైతులపై రూ.40 కోట్ల భారం
ప్రస్తుత రబీ సీజన్‌కు జిల్లాలో47 వేల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంచనాలకు తగ్గుట్లుగా డెలివరీ వస్తోంది. ఇప్పటి వరకు 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయం జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాశాఖ అంచనా వేసింది. మరో 18,789 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 7294 మెట్రిక్ టన్నులు, డిఏపి 1680, ఎంఒపి 2237, కాంప్లెక్స్ ఎరువులు 7579 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయి. వరిసాగు ఎకరానికి మూడు నుంచి ఐదు బస్తాలు, మొక్కజొన్న, పత్తి, సోయా పప్పుదినుసు పంటలకు సైతం ఎకరానికి మూడు నుంచి నాలుగు యూరియా బస్తాలు వాడుతున్నారు. ఎకరాకు సుమారు రూ.200 చొప్పున లెక్కించినా సుమారు రూ.40 కోట్ల భారం పడుతోంది.










