ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
శ్రీ చైతన్య యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులను భలి చేయడం తగదని, తక్షణమే విద్యార్ధులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించేలా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పవన్ కోరారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ మండలం బొమ్మూరులో పూర్తి స్థాయి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాలను నడుపుతుందని తెలిపారు. అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు తరగతులు ప్రారంభం అయిన మూడు నెలల తరువాత పాఠశాలను మూసేయాలని నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. ఆ నోటీసుకు యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నెల 3న విద్యాశాఖ అధికారులు పాఠశాలకు తాళాలు వేశారని తెలిపారు. దీంతో విద్యార్ధులు గత 20 రోజులుగా విద్యకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చేసిన తప్పు, అధికారుల నిర్లక్ష్యానికి నేడు విద్యార్థులు భలి అయ్యారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయం చూపాలని, విలువైన పని దినాలు పోకుండా చూడాలని డిమాండ్ చేశారు. సుమారు 500 మంది విద్యార్థుల తల్లి, తండ్రులు పిల్లల తరగతులు జరగకపోవడంతో తీవ్రమైన ఆందోళనతో ఉన్నారని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.రాజులోవ, ఎం..సుందర్ బాబు పాల్గొన్నారు.










