ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, నల్లజర్ల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతల ఆశలను ఆవిరి చేశాయి. వరి, మొక్కజొన్న రైతులకు నిరాశను మిగిల్చాయి. నాలుగు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిన విషయం విదితమే. జిల్లాలోని పలు మండలాల పరిధిలో ఈదురుగాలులు నానా బీభత్సం సష్టించాయి. సోమవారం తెల్లవారు ఝాము నుంచి జిల్లావ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరిగా చేతికివచ్చిన సమయంలో ధాన్యం నీటిపాలు కావడంతో రైతుల్లో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ఈదురుగాలులకు అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతన్నలు నష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. సరిగా పంటలు కోతకు రావడం, ధాన్యం చేతికి అండదండలతో కొనుగోలు కేంద్రాలకు తరలించే లోపే వర్షం ముంచెత్తింది. అకాల వర్షాల కారణంగా కళ్లాలలో, రైస్‌మిల్లుల వద్ద బయట ఉన్న రైతుల ధాన్యం రాశులు నీటి పాలవుతుండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
5200 మెట్రిక్ టన్నుల వరకు తడిసిన ధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 336 ఆర్‌బికెలు ఉన్నాయి. ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా దాదాపుగా వరి కోతలు పూర్తవడంతో రైతులు పెద్దఎత్తున ధాన్యాన్ని తరలిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందనే కారణంతో మిల్లర్లు ధాన్యం దింపుకోవడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని రోడ్ల వెంబడి, కళ్లాల్లో కుప్పలు, కుప్పలుగా ధాన్యం రాశులను రైతులు పోసి ఆర బెట్టిన తర్వాత తరలిస్తున్నారు. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి ఈ ధాన్యం తడవడమే కాకుండా కుప్పల మధ్య భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో ధాన్యం కుప్పలను ఎత్తి వర్షపునీటిని తొలగించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అకాల వర్షానికి సుమారు 5200 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో రెట్టింపు సంఖ్యలో ధాన్యం తడిచినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పు రావటంతో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు సమాయత్తం అయ్యారు. మంగళవారం వర్షం కురవనట్లయితే నష్టాల నుంచి గట్టెక్కే పిరస్థితులు ఉన్నాయి.
ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలుకు సమాయత్తం
సోమవారం ఉదయం కురిసిన కుండపోత వర్షం సరాసరిన జిల్లావ్యాప్తంగా 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. రాజమహేంద్రవరంలో 33.6 మిల్లీమీటర్లు, కొవ్వూరులో 37.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆఫ్‌లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు పద్ధతిని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, మార్కెటింగ్ అనుబంధ శాఖలు అధికారులు సోమవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఆనుమతితో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టరు తెలిపారు. ఈ విధానంతో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి రెండు గంటలకు ధాన్యం కొనుగోలు వివరాలు వెల్లడించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఇ క్రాప్ ఆధారంగా రైతులకు రైస్‌మిల్లులకు ఆర్‌బికె సిబ్బంది మ్యాపింగ్ చేస్తున్నారు. అనంతరం అక్కడకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనాగా తెలుస్తోంది. అకాల వర్షానికి నల్లజర్ల మండలంలోని అనేకమంది రైతులు చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దవటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. పంట తడిసిపోవడంతో తక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.










