Mar 27,2023 22:42

ప్రజాశక్తి - సీతానగరం మండలంలోని పలు లంక ప్రాంతాల్లో అకాల వర్షాలకు మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల లెక్కలపై రైతుల్లో తీవ్ర అసంతప్తి నెలకొంది. పంటనష్ట అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. ఈదురు గాలులు, వడగళ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. మండలంలోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించడంలో విఫలం చెందారు. రైతులకు త్వరితగతిన నష్ట పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ మందకొడిగా నష్ట అంచనా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చెబుతున్న ప్రాథమిక అంచనాలపై రైతులు తీవ్ర అంసతప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంటలో 33 శాతం దెబ్బతింటేనే నష్టం జాబితాలో చేరుస్తామంటున్నారని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని రైతులు చెప్పుకొస్తున్నారు. అకాల వర్షాలకు పెద్దఎత్తున దెబ్బతిన్న పంటల్లో దెబ్బతిన్నట్లుగా చెబుతుండగా ఒక్క సీతానగరం మండలంలోనే మొక్కజొన్న పంట నష్టం పెద్దఎత్తున ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ మండలంలో సీతానగరం లంక ప్రాంతాల్లో వందల ఎకరాలకుపైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. పంటనష్టం పెద్దఎత్తున జరిగినట్లు రైతులు చెబుతున్నా అధికారుల లెక్కలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. 33 శాతం నిబంధన పేరిట దెబ్బతిన్న పొలాలను సైతం లెక్కల నుంచి పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున కూలిన మొక్కజొన్న పంట తోటలనే లెక్కల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటనష్టం అంచనాలకు సంబంధించి పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. పంట నష్టం నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెబుతున్నా చురుగ్గా సాగుతున్న దాఖలాల్లేవు. సీతానగరం రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్‌ విఎఎలకు రైతులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టం అంచనాలపై నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. అంచనాలన్నీ గోల్‌మాల్‌గా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక అంచనాలపై వ్యవసాయాధికారులు కనీసంగా ప్రకటన చేయని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పంటనష్టంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ రైతుల్లో సాగుతోంది. దెబ్బతిన్న పంటను లెక్కించి పరిహారం త్వరితగతిన అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. పంటనష్టానికి ఇచ్చే పరిహారంపైనా రైతుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పెట్టుబడులు ఎక్కువగా ఉన్న కాలంలో చేపట్టిన లెక్కల ప్రకారమే పరిహారం ఇస్తుండటంపై రైతుల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతోంది. పెట్టుబడులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంట నష్టపరిహారం సైతం పెంచాలని రైతులు కోరుతున్నారు. నిబంధనలు సడలించి రైతలకు న్యాయం చేయాలని కోరారు. అకాల వర్షం, వడగళ్ల వానలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. నిబంధనల పేరుతో నష్టం అంచనాలను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఉద్యాన, ఆహార పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. పంటనష్టం అంచనాల్లో 33 శాతం నిబంధనను సడలించి పంటనష్టం నమోదు చేయాలి. ఎంతమేర పంటనష్టం జరిగిందో నమోదు జరగాలి. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.