May 09,2023 23:51

మహాలక్ష్మి(ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి- కడియం
దాదాపు ఐదు దశాబ్దాలుగా వరి కుచ్చులు అల్లుతూ, వాటిని ఆలయాల్లో, విశాల జాగాలో చెట్లకు కడుతూ పక్షులకు ప్రాణప్రదాతగా నిలిచిన పెనుమాక మహాలక్ష్మి(73) మంగళవారం కన్నుమూశారు. ఆయన జీవిత చరిత్రను తెలంగాణా పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా కూడా పొందుపర్చారు. కడియానికి చెందిన పెనుమాక మహాలక్ష్మి భార్య పదేళ్ల క్రితమే కాలం చేశారు. ఆయనకి వివాహితులైన ఇద్దరి కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరందరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కళ్లాలకు వెళ్లి వరి పనలు అడిగి తెచ్చుకొని వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న రామాలయంలో ఉంచి వాటిని వరికుచ్చులుగా మహాలక్ష్మి అల్లుతుండేవారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అల్లిన వరి కంకులను దేవాలయాలు, చెట్లకు కడుతూ ఉండేవాడు. వరి కంకులు కట్టడంలో బహు నేర్పరైన మహాలక్ష్మికి పక్షులంటే ఎంతో మక్కువ. తాను కట్టిన వరి కంకులను పక్షులు తింటూ ఉంటే చూసి మురిసిపోయేవాడు. 'పని పాటు లేకుండా పక్షుల కోసం కాలక్షేపం చేస్తే ఎలా?' అని ఎవరైనా ఎద్దేవా చేస్తే 'వాటికి మనం కాకపోతే ఎవరు పెడతారు బాబయా'' అంటూ సమాధానమిచ్చేవాడు. ఎవరన్నా వరిపన ఇచ్చి కుచ్చులు కట్టమంటే కట్టిపెట్టేవాడు. వాళ్లు మెచ్చి పదో పరుకో ఇస్తే తీసుకునేవాడు. మహాలక్ష్మి చేస్తున్న మూగజీవుల సేవలు గురించి అనేకసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాస , తదితరులు మహాలక్ష్మి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.