Jul 31,2023 23:38

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. వాయుగుండం కారణంగా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలోనూ కురుస్తున్న వర్షాలు వరద తాకిడిని మరింత రెట్టింపు చేశాయి. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం గంటలకు 39.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 24 గంటల క్రితం అక్కడ 50.50 అడుగుల నీటిమట్టం నమోదైన విషయం విదితమే.ధవళేశ్వరం వద్ద ఉధృతి యథాతధంగానే కొనసాగుతుండటంతో తూర్పు గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 30 లంక గ్రామాలు ఇప్పటికీ భయం గుప్పెట్లో బిక్కుబిక్కు మంటున్నాయి. కాటన్‌ బ్యారేజీ వద్ద బ్యారేజీ వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలకు 14.60 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది.
ప్రజాశక్తి-యంత్రాంగం
రాజోలు సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంకలో పునరావాస కేంద్రానికి రాలేదనే కారణంతో బాధిత కుటుంబాలకు ఆహారం సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురం మండలం రామరాజులంక బాడవలో తాగునీటి సమస్య వెంటాడింది. అప్పనిరాములంక, సఖినేటిపల్లి లంక పరిసర లంక గ్రామాల్లో రెండు వేల పశువులు వరద బారిన పడ్డాయి. లంక గ్రామాల రైతులు ఎక్కువగా పచ్చ మేతపై ఆధారపడి పశు పోషణ చేస్తుంటారు. ప్రస్తుతం పచ్చి గ్రాసం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. గడ్డి వాములు మునిగిపోయాయి. దీంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయని అప్పనరామునిలంక పల్లిపాలెంకు చెందిన కె.కుమారి తెలిపారు. నివాసాల చుట్టూ వరదతో బయటకు వెళ్లాలంటే పడవలను ఆశ్రయించాల్సిందేనని, పిల్లలకు పాలు సరఫరా కాలేదని, తాగునీరు లేదని వాపోయారు.
వరద బాధితులను ఆదుకోవాలి
ముమ్మిడివరం ముమ్మిడివరం మండలం వరదబాదిత లంక గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది. లంకాఫ్‌ ఠానేలంక, కూనలం, గురజాపులంకలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లోతట్టు పాంత్రాలు, లంక పాంత్రాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయన్నారు. బాధిత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని, బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చాలని, తక్షణం కుటుంబానికి రూ.ఐదు వేల నగదు, 50 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, కిరోసిన్‌, పాలు, గుడ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గా ప్రసాద్‌, సఖిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, ఎ.లక్ష్మణరావు కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఎన్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు. అయినవిల్లి మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పి.దుర్గారావు దొర అన్నారు వరద ప్రభావిత ప్రాంతాలైన కొండుకుదురు, పొట్టిలంక, గుండమ్మ చెరువు వరద ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ముంపు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులను సందర్శించారు. రోగులకు సత్వర సేవలు అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట సిసి రామకృష్ణ, వైద్యాధికారి డాక్టర్‌ సునీల్‌, హెచ్‌ఎస్‌ రామారావు, మేరీ, సత్య శ్రీనివాస్‌, నరసింహారావు పాల్గొన్నారు. మామిడికుదురు వరద ఉధతిలో అప్పనపల్లిలో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీట మునిగాయి. వరద బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు అమలు కావడం లేదని క్షేత్రస్థాయిలో బాధితులు వాపోతున్నారు. రేషన్‌ కార్డుకు ఒక ఆహార పొట్లం మాత్రమే ఇస్తున్నారని కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే అందరికీ ఎక్కడ సరిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు మొక్కుబడిగా పరామర్శించి వెళ్లిపోయారని తమ బాధను పట్టించుకోవడం లేదన్నారు. నివాసగహాలు చుట్టూ నీరు చేరినా తమకు మంచినీళ్లు, పాలు, అందడం లేదని బాధితులు వాపోయారు. వరద చుట్టుముట్టిన కుటుంబాల వారందరికీ సహాయం చేస్తున్నట్టు అప్పనపల్లి ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. అమలాపురం రూరల్‌ పట్టణానికి చెందిన వెంకటేశ్వరా డిగ్రీ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు బోడసకుర్రు, పాసర్లపూడి ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం, పలువురికి నగదు సాయం అందించారు. సాకుర్రులో ముంపు ప్రాంతాలను టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలమూరి ధర్మపాల్‌ పరిశీలించారు. కాట్రేనికోన వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబం కు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పల్లిపాలెం, పల్లంకుర్రు, నడవపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరద పూర్తిగా తగ్గే వరకూ బాధితులకు భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు.