ప్రజాశక్తి-గోకవరం వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సిబ్బందితో పాటు పౌర సమాజం భాగస్వామ్యం అవ్వాలని ఫోక్స్ పేట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.కరుణాకర్ అన్నారు. సూదికొండ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో వన్యప్రాణులు సంరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1973లో మనుగడ ముప్పు ఎదుర్కొంటున్న వన్యప్రాణుల అంతర్జాతీయ వ్యాపారం ఒప్పందం ద్వారా ఐక్యరాజ్యసమితి వన్యప్రాణుల దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తున్న దేశాల జాబితాలో మనం 4వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. ఫోక్స్‌పేట రేంజ్ అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించి అటవీ కార్చిచ్చుకు కారణమయ్యే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి రాజా, ఫారెస్ట్ సెక్షన్ అధికారి భూపాల్, ఫారెస్ట్ బీట్ అధికారి ప్రశాంత్ కుమార్, కె.మనోహర్, కెడి.శ్రీను, డిఇఒ గోవింద్ పాల్గొన్నారు.










