Feb 08,2023 23:11

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి సంక్రాంతి పండుగ దాటినా జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకూ తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రత అధికంగా ఉంది. దీనికితోడు పొగమంచు కూడా ఉండటంతో తెల్లవారుజామునే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే సంకోచిస్తున్నారు. రోడ్డు కనబడక వాహనదారులూ అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచే చలి ఎక్కువై మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఆ ప్రభావం తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోజువారీ పొలం పనులకు గిరిజనులు ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు సంశయిస్తున్నారు. మరోవైపు వృద్ధులు చిన్నారులకు సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దాంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
శ్వాసకోస వ్యాధిగ్రస్తుల అవస్థలు
చలి నుంచి విముక్తి పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతుండటంతో ఆస్తమా, నెమ్ము, జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతోపాటు జ్వరాలబారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. చిన్నపిల్లలు నుంచి వద్ధుల వరకు రోగాల బారిన పడుతున్నారు. దీంతో చలి ముగిసే వరకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉన్ని దుస్తులు ధరించడంతో పాటు మంకీ టోపీ, స్వెటర్లు శరీరం పూర్తిగా కప్పేలా దుస్తులు, కాళ్లకు సాక్సులు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి చేసి చల్లార్చిన, గోరువెచ్చని నీరు తాగాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో రాత్రిపూట ఎసిలకు బదులు, హీటర్లు వినియోగిస్తున్నారు. దీంతో హీటర్ల వాడకం అధికమైంది. వేడినీటి కోసమూ హీటర్ల వాడకమూ ఎక్కువగా ఉంటోంది.
వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 98.6 డిగ్రీల ఫారన్‌హీట్‌ అవసరం. 96కు పడిపోయినా 102కి పెరిగినా శరీరం తట్టుకునే పరిస్థితి లేదు. వద్ధులు, చిన్నారులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చలి తీవ్రత కారణంగా రక్తం వెచ్చదనంగా మారి శరీరం చెమటలు పట్టడం జరుగుతుంది. పాల్సీఫారం, ఇన్‌ఫ్లూమెంజా వైరస్‌ల సంఖ్య పెరి గి బాధితులపై దాడి చేస్తాయి. దీనివల్ల న్యూమోనియా సోకి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరంలోని చేతివేళ్లు, కాలివేళ్లు, చెవులు కొసలు వంటి బాగాలకు రక్తప్రసరణ ఆగి చర్మవ్యాధులకు దారి తీస్తుంది. ఫంగస్‌ సమస్య తలెత్తి, రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. డస్ట్‌ ఎలర్జీ, లంగ్‌ ఎలర్జీ వస్తుంది. అల్ప ఉష్ణోగ్రతలు కారణగా 60 ఏళ్లపైబడ్డ వద్ధులకు, ఐదేళ్లలోపు చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చిన్నారులు వద్ధుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నారులను చలిలో బయటకు తీసుకురాకూడదు. అత్యవసరంగా బయటకు తీసుకెళ్లాలంటే తలకు, శరీరానికి నూలు వస్త్రాలు తొడగాలి. ఎంతకీ తగ్గని జలుబు, జ్వరం ఉంటే వెంటనే చిన్నపిల్లల వైద్యుని కలవాలి. అల్ప ఉష్ణోగ్రతలు, పొగ మంచుకు చిన్నారులను దూరంగా ఉంచాలి. వద్ధుల్లో మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి వాతావరణంలో ఉదయం పూట నడక మంచిది కాదు. శరీరాన్ని పూర్తిగా కప్పేలా దుస్తులు వేసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, రెండు రోజులైనా తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, నీళ్లు తాగరాదు వేజ్‌లిన్‌, పెట్రోలియం జెల్లీ ఉపయోగించాలి. ఆస్తమా వచ్చే అవకాశం ఉంటే ముందుగా మందులు వేసుకోవాలి.