Feb 12,2023 23:24

పొట్టకూటి కోసం పాకులాట
ప్రాంతంగాని ప్రాంతంలో ఉపాధి పోరాటం
ప్రజాశక్తి - రాజానగరం
వలస పక్షుల జీవనం ఛిద్రంగా మారుతోంది. పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం నగరాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకు పోరాటం చేస్తున్నారు. కనీసం ఉండటానికి గూడు కూడా లేక ఊరికి శివారు డేరాలు వేసుకుంటూ జీవిస్తూ... చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు గాని, కనీసం రేషన్‌ బియ్యం కూడా అందని పరిస్థితి. వారి పిల్లలు విద్యకు దూరంగా మసకబారుతున్న బాల్యంలోనే రోజులను వెళ్లదీస్తున్నారు.
రాజానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వచ్చి ఇక్కడ చిరువ్యాపారలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం జోగ్‌పూర్‌కు చెందిన సీతాదేవీ, గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన లాహార్‌కుమలర్ణి, మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన దేవయానీ రాథోడ్‌ తదితర కుటుంబాలు ఇక్కడకు వలస వచ్చాయి. ప్లాస్టిక్‌ పువ్వులు తయారు చేసి అమ్ముకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో జీవనోపాధి లేక ఇలా వచ్చేశామని వారు చెబుతున్నారు. ముడి సరుకులను సొంత రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ తయారు చేసుకుని అమ్మకుంటున్నామని తెలిపారు. అమ్మిన డబ్బులుతోనే కుటుంబ పోషణ ఉంటుందని తెలిపారు. ఏడాదిలో హోళీ రోజున వారు సొంత రాష్ట్రాలకు వెళ్తారు. మిగిలిన సమయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు వలస వస్తామని చెబుతున్నారు. తమకు ప్రభుత్వాలు ఎలాంటి వసతులు గాని, సాయం గాని అందించట్లేదని తెలిపారు.
చదువులకు దూరం
వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. వీరికి ఎలాంటి విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. పెద్దలు ప్లాస్టిక్‌ పూల తయారీ, అమ్మకాలకు వెళ్లిపోతుండగా చిన్నారులు డేరాల వద్దే అపరిశుభ్రమైన ప్రాంతంలోనే ఆడుకుంటున్నారు. పూర్తిగా నిరక్ష్యరాసులుగానే మిగిలి పోతున్నారు. కనీసం వీరికి పౌష్టికాహారం కూడా దొరకని పరిస్థితి. బడిబయట పిల్లలను బడిలోనే ఉంచాలని చట్టాలు చెబుతున్నా... వీరికి మాత్రం అది అమలు కావట్లేదు.
గుజరాత్‌ నుంచి వచ్చాను
మాది గుజరాత్‌. అక్కడ ఉపాధి దొరక్కపోవడంతో ఇక్కడికి వచ్చారు. ప్లాస్టిక్‌ పూలు అమ్ముకుంటా కుటుంబాన్ని పోషిస్తున్నాను. మాకు ఎవరూ ఎలాంటి సాయం అందించట్లేదు.
- లాహోర్‌ కులకర్ణి, గుజరాత్‌
ప్లాస్టిక్‌ పూలు అమ్ముకుంటూ...
మాది మహారాష్ట్ర. ఉపాధి లేక కుటుంబంతో సహా వచ్చాను. ప్లాస్టిక్‌ పూలు అమ్ముకుంటూ జీవిస్తున్నాం. హోళీ పండుగకు మాత్రమే మా రాష్ట్రానికి వెళ్తాం. మళ్లీ ముడిసరుకు తెచ్చుకుని మళ్లీ ఇక్కడికి వచ్చేస్తాం.
- దేవీలాల్‌ రాథోడ్‌, మహారాష్ట్ర