ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఐదో విసిగా ఆచార్య కె.పద్మరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. శనివారం యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆచార్య కె.పద్మరాజుకు ఘనంగా స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయంలోని నన్నయ విగ్రహాలకు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పద్మరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్‌ఛార్జి విసి జివిఆర్.ప్రసాదరాజు, రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ సమక్షంలో కె.పద్మరాజు బాధ్యతలు స్వీకరించారు. నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాల అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అనుబంధ కళాశాలల యాజమాన్యాలు పద్మరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఇసి హాల్లో ఇన్‌ఛార్జి విసిగా సేవలందించిన జెఎన్‌టియుకె విసి ప్రసాదరాజును నన్నయ విశ్వవిద్యాలయ అధికారులంతా సన్మానించి వీడ్కోలు తెలిపారు. అనంతరం పద్మరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై చేస్తున్న ఖర్చును ఖర్చుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నారని, దానికి తగినట్టుగా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువ అనుబంధ కళాశాలలతో పెద్ద విశ్వ విద్యాలయంగా పేరుపొందిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని అభివద్ధి పథంలో నడిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా సమష్టి కషితో పని చేస్తేనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అభివద్ధి చెందుతుందని అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఎన్నో వనరులు, వసతులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుంటూ విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. విశ్వవిద్యాలయ సిబ్బంది అంతా క్రమశిక్షణతో విశ్వవిద్యాల అభివద్ధే ధ్యేయంగా పని చేయాలన్నారు.. విశ్వవిద్యాలయం నుండి బయటకు వెళ్ళే విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సంపాదించుకొని తీసుకువెళ్లాలని అన్నారు. విశ్వవిద్యాలయ సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేసారు. అనంతరం విశ్వవిద్యాలయ కేంద్ర పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు మరియు అనుబంధ కళాశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.










