ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విశాఖ ఉక్కును ప్రభుత్వంలోనే కొనసాగించాలని, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని కోరుతూ సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేసించి సిపిఐ నాయకులు తాటిపాక మధు మాట్లాడారు. పోరాడి సాధించుకున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అధికారంలోకొచ్చాక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మేస్తున్నారన్నారు. 32 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్లను అమ్మేయడం దుర్మార్గమన్నారు. మోడీ తన విధానాలను విరమించుకునే వరకు పోరాటం ఆపేది లేదని మధు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, నాయకులు కె.జ్యోతిరాజు, ఆచంట సత్యనారాయణ, ఎం.ప్రసాద్, సిహెచ్.సునీల్ తదతరులు పాల్గొన్నారు.










