Aug 13,2023 23:47

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఒక వైపు కండ్ల కలకలు మరో వైపు విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ శివారులలో తీవ్రత అధికంగా ఉంది. గత నెల వరకూ అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాల కారణంగా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా చిన్న పిల్లలు, పెద్దలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా టైఫాయిడ్‌, మలేరియా, తదితర విషజ్వరాలతో పాటు శ్వాసకోస సంబంధిత కేసులు రెట్టింపవుతున్నాయి. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా వాతావరణం చల్లబడటం, చల్లని గాలులు వీయడం వంటి కారణాలతో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు దోమలు విజంభించడంతో సమస్య తీవ్రమవుతోందని ప్రజలు భయపడుతున్నారు.
ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఒపి
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజురోజుకూ ఒపి పెరుగుతోంది. దగ్గు, జలుబు సమస్య పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తోంది. వైరల్‌ జ్వరం నాలుగైదు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నా దగ్గు, జలుబు మాత్రం రెండు వారాలు పైగా తీవ్రత చూపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని సర్వజన ప్రభుత్వా సుపత్రిలో ప్రతి రోజు 220 నుంచి 280 వరకూ వరకు జ్వరాల ఒపి కేసులు నమోద వుతున్నాయి. ఇతర ప్రభుత్వ ఆస్పత్రులలో సుమారు 100 ఒపిలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు 1500 నుంచి 2000 వరకు ఒపి నమోదు అవుతోంది. వీరిలో 30 శాతానికిపైగా జ్వరాలతో చిన్న పిల్లలు ఆసుపత్రికి వస్తున్నారు. నిత్యం 200కు పైగా రక్త నమూనాల పరీక్షలు చేస్తున్నారు. అయితే జ్వర పీడితులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇష్టానుసారంగా పరీక్షలు
జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారు జ్వర భాధితులు మాత్రమే ఉంటున్నారు. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలు జ్వరాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రులకు పరుగు తీస్తున్నారు. గత వారం, పది రోజులుగా ఏ ఆసుపత్రి చూసినా నిత్యం సాధారణం కంటే ఎక్కువగా ఒపిలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అవసరం ఉన్నా లేకున్నా రక్తం, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో అడ్మిట్‌ చేసుకొని రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా మందులు రాస్తూ ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లపై పర్యవేక్షణ కొరవడటంతో ధనార్జనే పరమావధిగా నిర్వహకులు వ్యవహరిస్తూ రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
తాజాగా విజృంభిస్తున్న ఈ వైరస్‌ కారణంగా నిరంతరం దగ్గు, జ్వరం, జలుబు శ్వాసకోస సమస్యలు ఉంటాయి. ప్లూ లక్షణాలు ఉన్నవారు ఇతరులతో చేతులు కలపడం, అలింగనం చేసుకోవడం కలిసి భోజనం వంటివి చేయకూడదు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ప్రస్తుతం విషజ్వరాలు విజంభిస్తు న్నాయి. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ ఫాక్స్‌ శ్వాసకోస వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. నెల రోజుల్లోనే ఈ కేసులు అధికంగా వచ్చినట్లు వైద్య వర్గాలు అంటున్నాయి. సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చే పిల్లలు త్వరగా కోలుకుంటున్నారని, నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో భౌతిక దూరం పాటించటంతో పాటు శానిటైజర్లను వినియోగించి చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.