ప్రజాశక్తి - రాజానగరం
స్థానిక దివాన్ చెరువు గ్రామంలో విజేస్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దివాన్ చెరువు మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.లక్ష్మి మాట్లాడుతూ సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చన్నారు. పొగ తాగడం, మద్యపానం, నిద్రలేమి, ఊబకాయం, అసమతుల్య ఆహారం, పాస్ట్‌ఫుడ్స్ వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉందన్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాలన్నారు. కనీసంగా గంట పాటు నడక, ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .డి .నరేంద్ర గారు మాట్లాడుతూ గుండె మానవ శరీరంలో ముఖ్యమైన అవయములో ఒకటి అన్నారు. అది సరిగ్గా పని చేయకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలన్నారు. కరోనా అనంతరం గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందన్నారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్‌వివి.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే అనేక మంది గుండెపోటుతో మత్యువాత చెందుతున్నారన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండానల్నారు. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, ఆహారం ఉప్పు, చక్కెర తగ్గించడం వంటివి చేయాలన్నారు.
కళాశాల చైర్ పర్సన్ ఎన్.శకుంతల మాట్లాడుతూ గుండె గుప్పెడంత ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయు పట్టు అదేనన్నారు. అలాంటి గుండెను ఉరుకులు పరుగులు జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలన్నదే మరిచిపోతున్నామన్నారు. నేడు జరుగుతున్న గుండెపోటు మరణాలకు ఇదే కారణమన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో గుండెను పదిలంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ పిఒ పివి.కిషోర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










