పెరుగుతున్న డిమాండ్... తగ్గుతున్న సరఫరా
ఆందోళనలో విద్యుత్ వినియోగదారులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఓ వైపు విద్యుత్ బిల్లు వాతలు, మరో వైపు అప్రకటిత కోతలు విద్యుత్ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయయి. గ్రామాలతో పాటూ నగరాల్లో సైతం కోతలు అనివార్యం అవుతున్నాయి. మరో పక్క విద్యుత్ బిల్లులు వినియోగదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అగస్టులో 50 నుంచి 60 శాతం వరకు పెరగడంతో ్ వినియోగదారులు వాపోతున్నారు.
అప్రకటిత విద్యుత్ కోతలు
జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కోతలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోజువారీ విద్యుత్ వినియోగం 18 మిలియన్ యూనిట్లు దాటింది. దీనికి తక్కువగానే విద్యుత్ సరఫరా వస్తుండడంతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రోజువారీ కోటా 18 మిలియన్ యూనిట్ల వరకు వస్తుండగా జిల్లాలో 18.3 నుంచి 18.6 మిలియన్ యూనిట్లు వరకు విద్యుత్ వినియోగం ఉంటోంది. విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన సమయంలో ఫ్రీక్వెన్సీ పడిపోతోందని దీంతో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు.
సర్ ఛార్జీల పేరుతో బిల్లుల వాత
గతంలో వినియోగించిన విద్యుత్‌కు విద్యుత్ సంస్థలు వసూలుకు ప్రభుత్వ అవకాశం కలి ్పంచిన విషయం విధితమే. దీంతో 2014 నుంచి 2019 వరకు వినియోగదారుడు వాడుకున్న మొత్తం యూనిట్లను లెక్కించి ట్రూఅప్ చార్జీ పేరుతో ఒక్కో యూనిట్‌కు 7 పైసల చొప్పున భారం వేశారు. ఆ మొత్తం భారాన్ని 18 వాయిదాలుగా విభజించి ప్రతినెలా చెల్లించేలా బిల్లులో జారీ చేస్తున్నారు 2021-22 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వాడుకున్న వినియోగాన్ని లెక్కించి ఒక్కో యూనిట్‌పై 19 పైసలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వంపై పడిన విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడానికి ఇలా రకరకాల ఛార్జీల పేరుతో వసూళ్లకు తెరలేపింది. దీంతో వినియోగపు ఛార్జీలకు మరో 30 శాతం అదనంగా బిల్లులు జారీ అవుతున్నాయి. దీనికి తోడుగా అడిషనల్ ఛార్జీల బాడుడు సైతం మొదలైంది. విద్యుత్ వినియోగదారుల గృహౌపకరణాల ఆధారంగా అడిషనల్ ఛార్జీలు వసూలు జరుగుతోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో సతమతమవుతున్న ప్రజలకు విద్యుత్ ఛార్జీ.లు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.
విద్యుత్ వినియోగం పెరిగింది
ఈ నెలలో 1100 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరగ డంతో అనివార్యంగా విద్యుత్ గృహోపకరణాల వినియోగం పెరిగింది. రొటేషన్ పద్ధతిన రిలీఫ్ ఇస్తున్నాము. జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేదు. విండ్ పవర్ పెరిగితే కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
- శ్రీధర్ వర్మ ఇన్‌ఛార్జి డి.ఇ ఎపిఇపిడిసిఎల్ రాజమహేంద్రవరం
విద్యుత్ కోతలతో ఇబ్బందులు
అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. రెండు రోజులుగా రాత్రి వేళల్లో కనీసం గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించడంలేదు. నగరం మొత్తం సరఫరా లేదంటూ సమాధానం ఇస్తున్నారు. ఓ వైపు అదనపు బిల్లులు వసూలు చేస్తున్నా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించడంలో విద్యుత్ సంస్థలకు చిత్తశుద్ది కరువైంది.
- జి.రమాదేవి. సాంబశివరావు పేట, రాజమహేంద్రవరం










