ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాబాట పట్టేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ నెల 9 నుంచి 15 వరకూ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించాయి. ఈ నెల 15వ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించనున్నట్లు వామపక్షాల నేతలు ప్రకటించారు. సిపిఐ కార్యాలయంలో ఆదివారం వామపక్ష పార్టీల సమావేశం సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు ఎవి రమణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపుదలపై జరుగుతున్న ఆందోళనల కొనసాగింపుగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 15వ తేదీన ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై పడుతున్న భారాల పరిస్థితిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ అందించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. ప్రతీనెల క్రమం తప్పకుండా ఛార్జీలను పెంచుతున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించిన ప్రస్తుత సిఎం జగన్ రెడ్డి ప్రజలకు చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజల్లోనే ఎండగడతామని అన్నారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్తు పథకానికి ఎసరు పెడుతున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో కోత పెడుతున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు టెండర్లు పిలిచారని, ఈ కాంట్రాక్టును అదాని, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యిందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు 2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, సిపిఐ నాయకులు కొండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు, వి.కొండలరావు, సిపిఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) జిల్లా నాయకులు జోజి, తదితరులు పాల్గొన్నారు.










