Sep 22,2023 23:23

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ 27న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వీటిని జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐ జిలత్లా కార్యదర్శులు టి.అరుణ్‌, టి.మధు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్యామల సెంటర్‌ వద్ద ఉన్న సిపిఎం కార్యాలయంలో సిపిఐ, సిపిఎం నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్‌, మధు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధం ఉందన్నారు. రాష్ట్రంలో కరెంట్‌ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. టెక్నాలజీ పెరిగిన తరుణంలో విద్యుత్‌ యూనిట్‌ రూపాయికి అందించ్చొచన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు కరెంట్‌ బిల్లు చుడగానే షాక్‌ కొడుతుందన్నారు. ఇప్పటికే స్లాబులు మార్చి భారం మోపారని, తాజాగా గత పదేళ్ల కాలంలో వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు కట్టినా మళ్లీ సర్దుబబాటు ఛార్జీల పేరుతో వచ్చే నాలుగు సంవత్సరాల్లో రూ.31 వేల కోట్ల భారం ప్రజలపై మోపనున్నారని తెలిపారు. మే నెల బిల్లుల్లో 2014 సంత్సరంలో వాడుకున్న కరెంటుకు మళ్లీ యూనిట్‌కు 20 పైసలు, 2021 మేలో వాడిన విద్యుత్తు యూనిట్‌కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్‌ నెలలో ఉపయోగించిన కరెంట్‌ యూనిట్‌కు 40 పైసలు కలిపి మొత్తం 80 పైసలు చొప్పున జనం నెత్తిన భారం మోపిన జగన్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. విద్యుత్‌ రంగాన్ని అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లపాటు వ్యవసాయానికి విద్యుత్‌ మొత్తం తయారు చేసే ఒప్పందం అదానికే ఇచ్చారన్నారు. విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసేది, బొగ్గు రావణా చేసే ఓడరేవులు, తాజాగా స్మార్ట్‌ మీటర్లు తయారు చేసేది సైతం అదానీకే కట్టబెట్టారన్నారు. కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం ద్వారా మోడీ, జగన్‌ లు తమ జేబులు నింపుకుంటున్నారని అన్నారు. ప్రజలపై ట్రూ అఫ్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని, విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టే ప్రత్తిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాచౌక్‌ల వద్ద ధర్నా చేసుకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ధర్నాలకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల తమ సమస్యల పరిష్కారం కొరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాలు జరిగినప్పుడు ఆందోళన చేయడం పరిపాటి అని అన్నారు. ఢిల్లీలో పార్లమెంటు జరిగే సమయంలో అనేక ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్‌, పి.మురళి, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, నాయకులు కె.సూరిబాబు తదితరులు పాల్గున్నారు.