ప్రజాశక్తి -దేవరపల్లి
విద్యుత్ భారాలను తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను నిలిపేయాలని, ట్రూఅప్ ఛార్జీలను ఆపేయాలని నినదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా తాను అధికారంలోకి వస్తే విద్యుత్‌ఛార్జీలు పెంచబోమని చెప్పారన్నారు. అధికారంలోకొచ్చిన తర్వాత వివిధ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. గతేడాది విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ.1,400 కోట్ల భారం మోపారన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై ప్రస్తుతం రూ.6వేల కోట్ల భారం వేస్తున్నారన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆచంట సత్యనారాయణ, బోనుల పోతురాజు, గన్నమని సూర్యచంద్రరావు, ముత్తిరెడ్డి దాలేశ్వరరావు, సిపిఎం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, ఎస్‌కె.భగత్, ఆచంట సుభాష్ చంద్రబోస్, కె.రత్నాజీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సిహెచ్.రమేష్, పి.నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు పొలమాటి పెంటయ్య పాల్గొన్నారు.










