Oct 15,2023 22:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యత్‌ ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు విద్యుత్‌ ఛార్జీలను పెంపుదల చేయనని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనలో తొమ్మిది దఫాలు విద్యుత్‌ ధరలను పెంపుదల చేసి ప్రజలపై మోయలేని భారాలు వేశారు. జగన్‌ సర్కార్‌ పెంచిన విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత స్పష్టం అయ్యింది. నగరంలోని ఆజాద్‌ చౌక్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా బ్యాలెట్‌లో విద్యుత్‌ ఛార్జీలను పెంపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంకు అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నలతో ప్రజల అభిప్రాయాలను బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా సమాధానాలను రాబట్టారు. గంట వ్యవధిలో 486 మంది ప్రజలు ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్నారు. ఇందులో 477 మంది విద్యుత్‌ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకంగా, ఇద్దరు అనుకూలంగా తమ మద్దతును ఇచ్చారు. మరో ఏడు బ్యాలెట్‌ పత్రాలు చెల్లకుండా పోయాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సిపిఐ(ఎంఎల్‌ న్యూడెమోక్రసీ) నగర కార్యదర్శి ఎస్‌.కిరణ్‌ కుమార్‌లు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నాలుగున్నర సంవత్సర కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జిలను పెంచి ప్రజలపై అధిక భారలు మోపారని విమర్శించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్‌ రంగం మొత్తం ప్రవేటికరించేందుకు తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల చట్టం 2022 రాష్ట్రంలో సిఎం జగన్‌ అత్యధిక వేగంగా అమలు చేస్తూ విద్యుత్‌ రంగంలో ప్రవేటికరణ, ప్రజలపై అదనపు భారాలను మోపుతున్నారని అన్నారు. వినియోగదారులు గతంలో చెల్లించిన బిల్లులపై ఇప్పుడు నష్టాలు వచ్చాయన్న పేరుతో ట్రూ అప్‌ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారాన్ని మోపడం దుర్మార్గమన్నారు. ఇవి చాలవన్నట్టు ప్రజలపై స్మార్ట్‌ మీటర్ల పేరుతో మరొక భారాన్ని మోపనున్నారని, స్మార్ట్‌ మీటర్ల తయారీకి ఆదాని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న బొగ్గు రెట్టింపు ధరకి ఆదానీ నుంచి కొంటున్నారని, బొగ్గు దిగుమతి చేసే ఓడ రేవులను కూడా ఆదానికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. విద్యుత్‌ రంగం మొత్తాన్ని ఆదానికి అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని తెలిపారు. అంతిమంగా ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం ఏప్రిల్‌ నెల నుంచి రెట్టింపు అయ్యిందని ఈ భారం భవిష్యత్‌లో కొనసాగే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, రామకృష్ణ, ఉమా, మురళి, స్రవంతి, రాము, సోమేశ్వరావు, కాంతారావు, సిపిఐ నాయకులు కె.రాంబాబు, సప్పా. రమణ, నల్ల.రామారావు, ఎడ్ల.లక్ష్మి, వెంకట్రావు, అప్పల నాయుడు, శ్రీనివాస్‌, సిపిఐ (ఎంల్‌ న్యూడెమోక్రసి) నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి కె.భాను ప్రసాద్‌, నాయకులు సతీష్‌, శ్రీను, గుత్తుల సత్యవతి, దినేష్‌, రవణ పాల్గొన్నారు.