ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రజలపై వేసిన విద్యుత్ భారాలను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం నగరంలోని శ్యామల సెంటర్‌లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు బి.పవన్, వి.కొండలరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు కె.జోజి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యాదర్శి బి.రాజులోవ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధం ఉందని, ప్రజలు తమ సమస్యలు చెప్పు కొనేందుకు రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కును సైతం రాష్ట్ర ప్రభుత్వం హరిస్తుందని మండిపడ్డారు. ఏడాది పొడవునా సెక్షన్ 30, 144 అమల్లో ఉంటోందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను జగన్ సర్కార్ విపరీతంగా పెంచుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల ప్రజలకు విద్యుత్ బిల్లులను చూడగానే షాక్ కొట్టినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే స్లాబులు మార్చి భారం మోపారని, ఇప్పుడు ప్రజల కళ్ళు కప్పి గత 10 ఏళ్లలో వాడుకున్న విద్యుత్‌కు ఛార్జీలను చెల్లించినా తిరిగి సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన రాబోయే 4 ఏళ్లలో రూ.31 వేల కోట్ల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యిందన్నారు. మే నెల బిల్లుల్లో 2014లో వాడుకున్న విద్యుత్‌కు తిరి యూనిట్‌కు 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్తు యూనిట్‌కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంట్ యూనిట్ కు 40 పైసలు కలిపి కరిపి మొత్తం 80 పైసలు చొప్పున జనం నెత్తిన భారం మోపారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత సంస్కరణల చట్టాన్ని ఉపసంహరిం చుకోవాలని, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రత్తిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు టిఎస్.ప్రకాష్, ఎస్‌ఎస్ మూర్తి, కె.రామకష్ణ, ఎస్. సోమేశ్వరరావు, పి. రామకష్ణ, స్రవంతి, చిన్న, రాజా, రాంబాబు, పి.మురళి, తాతారావు, అప్పల నర్శయ్య, సిపిఐ నాయకులు కె.రాంబాబు, ఎడ్ల లక్ష్మి, సూరిబాబు, రామకష్ణ, భద్రరావు, సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










