ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతి ఒక్కరూ విద్యతోపాటు, క్రీడారంగంలోనూ రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు ఆలీ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ (ఆర్‌పిఎల్) క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆలీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ ఐపిఎల్‌కు ఏమాత్రం తగ్గకుండా ఆర్‌పిఎల్‌ను నిరాటంకంగా కొనసాగిస్తున్న మాజీ కార్పొరేటర్, ఆర్‌పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ చైర్మన్ అజ్జరపు వాసు, ఆయన మిత్రబృందాన్ని ఆయన అభినందించారు. ఆర్ట్స్ కళాశాల మైదానానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ నుంచి తన ప్రస్తానాన్ని ప్రారంభించిన వారు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్‌పిఎల్ ఆడిన ఇద్దరు క్రీడాకారులు ఐపిఎల్‌కు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్, అజ్జరపు వాసు, కుంచే శేఖర్‌ను వారు అభినందించారు. తొలుత మంజీరా నుంచి భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ ఎంఎల్‌ఎ రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ రౌతు పార్థసారధి, డాక్టర్ కృష్ణారావు, వైసిపి నాయకుడు నక్కా శ్రీనగేష్ పాల్గొన్నారు.










