ప్రజాశక్తి - రాజమహేంద్రవరం పది విద్యార్థులను పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా డిఇఒ ఎస్.అబ్రహాం ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక ఐఎల్‌టిడి జంక్షన్ వద్ద గల శ్రీసత్య సాయి గురుకులం ఆడిటోరియంలో నేడు జిల్లాలోని 19 మండలాల పదో తరగతి బోధించే తెలుగు, గణితం సబ్జెక్టు ఉపాధ్యాయులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత మండలాల వారీగా ఇప్పటివరకూ ఉన్న విద్యార్థుల స్థితిగతులు, స్థాయిలపై సమీక్ష జరిపారు. వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు కూడా కేవలం చదివించడమే కాక విద్యార్థి సందేహ నివృత్తికి వినియోగించుకోవాలన్నారు. మాదిరి ప్రశ్నపత్రాలు, ఒఎంఆర్ షీట్, జవాబులు రాసే బుక్‌లెట్‌పై కూడా విద్యార్థికి వివరించాలన్నారు. 9వ తేదీ నుండి నిర్వహించబోయే ప్రి పబ్లిక్ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. ప్రశ్నపత్రాలు జిల్లా పరీక్షల నిర్వహణా సంస్థ సరఫరా చేస్తుందని, ఈ అంశంపై ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉప విద్యా శాఖాధికారి ఎమ్.తిరుమలదాస్, సత్య సాయి గురుకులం ప్రిన్సిపల్ గురయ్య, 620 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.










