ప్రజాశక్తి- ధవళేశ్వరం నేటి ఆధునిక పోకడలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచన, విషయ పరిజ్ఞానంపై తార్కిక వివేచన పెంచేలా సైన్స్ బోధన ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఆల్కట్ గార్డెన్స్‌లోని శ్రీసత్య సాయి గురుకులంలో రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే శాస్త్ర విజ్ఞానం పట్ల మక్కువ పెంచుకున్న వారు ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా తయారు అవుతారన్నారు. కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి వి.శ్యామ్ వినూత్నంగా రూపొందించిన బోర్డ్‌పై నీటిని వెదజల్లగా.. సైన్స్ ఫెయిర్ ప్రారంభం అని రావడం గమనించి కమిషనర్ ముచ్చట పడ్డారు. నేడు ఆధునిక మానవుని జీవన శైలిలో నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం అయిందన్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను కమిషనర్ తిలకించారు. డిఇఒ ఎస్.అబ్రహాం మాట్లాడుతూ గత డిసెంబర్‌లో మండల స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం పొందిన ప్రాజెక్టులు, జిల్లాలోని 19 మండలాల నుంచి ఈ జిల్లా స్థాయి ప్రదర్శనకు మొత్తం 95 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని, అవి నేడు జిల్లాస్థాయి ప్రదర్శనకు వచ్చాయని తెలిపారు. ఒక్కొక్క థీమ్ నుండి రెండు చొప్పున మొత్తం 10 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డివైఇఒ ఎం.తిరుమల దాస్, అర్బన్ రేంజ్ డిఐ బి.దిలీప్ కుమార్, రూరల్ ఎంఇఒ ఎ.తులసీదాస్, సత్య సాయి గురుకులం కరెస్పాండెంట్ ఎ.శ్యామ్‌సుందర్, ప్రిన్సిపల్ కె.గురవయ్య, జిల్లా సైన్స్ అధికారి జివిఎన్‌ఎస్.నెహ్రూ, జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ కె.సతీష్ బాబు, కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, ఎస్‌ఎల్‌వి.రమేష్, గణపతి, వెంకట రమణ పాల్గొన్నారు.










