Mar 26,2023 22:54

పది పరీక్షలకు ముందుగానే అడ్మిషన్ల వేట

తల్లిదండ్రులకు ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ల హోరు
కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల జోరు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
పదో తరగతి పరీక్షలు ప్రారంభానికి ముందే కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులకు వల వేస్తున్నాయి. కళాశాలల ప్రతినిధులు ఏకంగా గ్రామాల్లో మధ్యవర్తులను పెట్టుకుని, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కాలేజీల ప్రత్యేకతలను వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల నెంబర్లు సేకరించి మొబైల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎసలు, ఫోన్లు చేస్తూ ఊదరగొడుతున్నారు. ఎలాగోలా బుట్టలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీటు రిజర్వ్‌ చేసుకుంటే రాయితీలిస్తామని చెబుతున్నాయి. వివిధ కోర్సులను ప్యాకేజీగా రూపొందించి 20 నుంచి 40 శాతం వరకూ ఆఫర్‌ చేస్తున్నాయి. విద్యార్థుల స్థాయిని బట్టి అడ్మిషన్లు సేకరిస్తున్నాయి.
వివరాలు మొత్తం సేకరించి..
ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్చాలోనన్న ఆలోచనలు ప్రారంభమయ్యాయి. గత రెండేళ్లు ప్రభుత్వ విద్యా సంస్థలు ఫలితాలు తలకిందులైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిపుష్టత లేకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసైనా మంచి కాలేజీలో చేర్పించాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు కార్పొరేట్‌, ప్రయివేటు కాలేజీల నిర్వహకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విద్యార్థులను ఎలాగైనా తమ కళాశాలలో చేర్చుకునేందుకు ఇంటింటా, ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కళాశాలలో ఉత్తమ బోధనతోపాటు ఫలానా ప్రత్యేకతలు ఉన్నాయని, చేరితే రాయితీలు ఇస్తామంటూ ఊదరగొట్టేస్తున్నారు. విద్యార్థుల చిరునామా, ఫోన్‌ నెంబర్లు ప్రయివేటు సంస్థల ప్రతినిధులు. ఆయా పాఠశాలల నుంచి ఇప్పటికే సేకరించారు. ఆ విద్యార్థి మార్కులు, కుటుంబ ఆర్థిక స్థోమతను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, స్థానికంగా నియమించుకున్న మొధ్యవర్తుల ద్వారా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నారు. తమ కళాశాలలో చేర్చితే ఫీజు రాయితీ ఇస్తామనీ, సౌకర్యాలు కల్పిస్తామనీ, పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామనీ, ఆలస్యం చేస్తే సీట్లు దొరకవని ఊదరగొడుతున్నారు. మరో వైపు ఉపాధ్యాయుల ద్వారా గాలం వేస్తున్నారు.
ఎవరి డప్పు వారిది..
రాజమహేంద్రవరం, కాకినాడలతో పాటు విజయవాడ, విశాఖపట్నం విద్యాసంస్థలు ప్రత్యేకంగా మధ్యవర్తులను నియమించుకుని, వారి ద్వారా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థలు ఉన్నాయని, జిల్లాలోనే కళాశాల శాఖ ఉందనీ, చేరాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు తామేమీ తక్కువ కాదని జిల్లాలోని పలు ప్రయివేటు కళాశాలలు కూడా విద్యార్థులపై వల వేస్తున్నాయి. ఈ ప్రచారంలో తమ కళాశాలలో ప్రత్యేకంగా ఎంసెట్‌, ఎఐఇఇఇ, ఐఐటి, జెఇఇ మెయిన్స్‌, ఎన్‌ఐటి శిక్షణ ఇస్తామని, పిలల్లకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపుతున్నారు. కళాశాలలో ఎసి, నాన్‌ ఎసి, డేస్కాలర్‌, హాస్టల్‌, మెస్‌ తదితర ప్రత్యేకతలు వినిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. వెంటనే డబ్బు చెల్లించి, సీటు ఖరారు చేసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. మెరుగైన మార్కులు సాధించిన వారికి ప్రత్యేక రాయితీలు అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల మాయమాటలు నమ్మి, కొందరు పిల్లలను చేర్పించేస్తున్నారు. మరి కొందరు కళాశాల చూసిన తరువాత చెబుతామని బదులు ఇస్తున్నారు. ముందుగా చేరితే ఫీజులో రాయితీ ఇస్తామని సంస్థలు చెబుతున్నాయి. ఫీజులు కూడా రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అడ్మిషన్లకు షెడ్యూలు ప్రకటించలేదు
ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లకు బోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. షెడ్యూలు ప్రకటించిన అనంతరమే అడ్మిషన్లు తీసుకోవాలి. బోర్డు నుంచి అనుమతులు రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తప్పవు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి.
- ఎన్‌ఎస్‌విఎల్‌ నర్సింహం, ఆర్‌ఐఒ, తూర్పుగోదావరి జిల్లా