ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరులోని మూర్తి రాజు స్కూల్లో నిర్వహించిన 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో చదివి.. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం, మెడల్, సర్టిఫికెట్, మెమెంటోలను అందించారు. తల్లిదండ్రులను, స్కూల్ హెచ్‌ఎంలను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థిని షేక్ మరియం సలేహా జగనన్న ప్రభుత్వంలో జరిగిన విద్యా సంస్కరణలపై ఇంగ్లీష్‌లో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మంత్రి ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు. జగనన్న విద్యా కానుక కింద ఉచితంగా పాఠ్యపుస్తకాలను, నోటుబుక్కులను, బ్యాగులు, యూనిఫామ్ అందచేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పథకం కింద చదువుకున్న విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తున్నారని తెలిపారు. జగనన్న నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా అభివద్ధి చేశారన్నారు. విద్యాభివద్ధి కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇలా అనేక సంస్కరణలతో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న మార్పుల కారణంగా ఈ రోజున పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. పిల్లలు పౌషికాహారంతో ఆరోగ్యంగా, బలంగా ఉండాలనే సంకల్పంతో పౌష్టిక ఆహారం అందజేస్తున్నామన్నారు.










