ప్రజాశక్తి - రాజమహేంద్రవరం శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాఘవ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మిక శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్య్కమంలో వెట్టి చాకిరీ వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిఎల్‌ఎస్ కె.ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వెట్టి చాకిరిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పనులు వెట్టిచాకిరిలోకి వస్తాయో వాటికి ఎలాంటి చట్టాలు ఉన్నాయో వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెంట్రల్ జోన్ డిఎస్‌పిలు జెవి సంతోష్, ఎం.భక్తవత్సలం, ఎం.శ్రీలత మాట్లాడారు. విద్యార్థులు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో రుగ్మతలను పారదోలడంలో విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యు ఎసి కో ఆర్డినేటర్ బి.విజయభారతలక్ష్మి పాల్గొన్నారు.










