Jul 12,2023 00:13

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
వేతనాలు పెంచపోతే మరో ఉద్యమం తప్పదని, ఐసిడిఎస్‌ని నిర్వీర్యం చేయాలని చూస్తే పాలకులకు తగిన బుద్ధి చెబుతామని, అంగన్‌వాడీల ధర్నాలో పలువురు నాయకులు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద 36 గంటలు మహాధర్న 2వ రోజు జరిగింది. ఈ మహాదర్నకు జిల్లా నలుమూలల నుండి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు హాజరయ్యారు. తొలుత అంగన్‌వాడీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, జనసేన జిల్లా అధ్యక్షుల కందుల దుర్గేష్‌, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ ధర్నాలో శిబిరంలో పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలకు వేతనాలు పెంచట్లేదన్నారు. 40 ఏళ్లుగా పేదలకుసేవలందిస్తున్నా తగిన గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఐసిడిఎస్‌కు నిధులు పెంచాల్సింది పోయి ఏటేటా తగ్గిస్తుందన్నారు. ఐసిడిఎస్‌ నిర్వీర్యనికి కేంద్ర, రాష్ట్ర పాలకులు కంకణం కట్టుకున్నారని అన్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సమస్యలు పరిస్కారం కోసం పోరాడు తున్న అంగన్‌వాడీలకు టిడిపి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడతామని తెలిపారు. జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. వీరి పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ దీక్షా శిబిరానికి విచ్చేసి మద్దతు పలికారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణి క్యంబ, వై.బేబిరాణి మాట్లాడుతూ ఐసిడిఎస్‌ పరిరక్షణకు 36 గంటల ధర్నా చేపట్టామన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. గత ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణా కంటే ఎక్కువ వేతనం అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా గ్రాడ్యూటీని అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్‌వాడీలకు అమలు చేయడం లేదన్నారు. రాజకీయ, అధికారుల వేధింపులు తీవ్రంగా పెరిగాయని, పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. రోజుకొక యాప్‌ తీసుకొచ్చి తీవ్ర పని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ ధర్నాలో ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘ డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబు, కోదండరామ్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.రాంబాబు, ఎం రాజా, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పోశమ్మ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో నాయకులు వై.సుజాత, సునీత, రామలక్ష్మి, అన్నపూర్ణ, ఎం.మార్త, దుర్గాంబ, సుబ్బలక్ష్మి, మాలతి, సుజాత, సరద, రామాలక్ష్మి పాల్గొన్నారు.