ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాష్ట్రంలో ఉద్యోగోన్నతి పొందిన వేలాది ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి అన్నారు. వేతనాలు చెల్లించాంలంటూ శుక్రవారం డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.జయకర్, ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉపాధ్యాయులు సమాచారం అంతా సమగ్రంగా ఉన్నప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే వేతనాలు నిలిపేసి గందరగోళం సృష్టించారన్నారు. రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి మాట్లాడుతూ గతేడాది పిఆర్‌సిని అమలు చేసిన సమయంలో ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే లక్షలాదిమందికి రెండు మూడు రోజుల్లో బలవంతంగా జీతాలు వేసిన ప్రభుత్వం నేడు ఉద్యోగోన్నతి పొందిన వారికి జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయడం హాస్యాస్పదమన్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇవివిఎస్‌ఆర్.ప్రసాద్, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని, లేకుంటే భవిష్యత్తులో భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అసోసియేట్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశ పూరకంగా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు ఇ.శ్రీమణి, రమేష్, రవిబాబు, రవి, ఎం.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. కార్యవర్గ సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు, ఐడి రాజేశ్వరి, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ అనిత తదితరులు పాల్గొన్నారు.










